మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన సర్కార్.. వాటిని కబ్జాల నుంచి సంరక్షించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేయగా… చెరువుల సర్వే, ఎఫ్టీఎల్(నీటి నిల్వ సామర్థ్యం) గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు చెరువుల సర్వేను పకడ్బందీగా చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 2,329 చెరువులుండగా 69 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పటికే 2,146 చెరువులకు ఎఫ్టీఎల్ ప్రక్రియ పూర్తికాగా.. మిగతావాటికి కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఫొటోలతో సహా చెరువుల సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చగా.. ఎఫ్టీఎల్ వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
-రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ): గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పాలకులు విస్మరించిన చెరువులకు సీఎం కేసీఆర్ ప్రభు త్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వవైభవం తీసుకొచ్చింది. అంతేకాకుండా చెరువుల సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే అన్ని చెరువులకు జియోట్యాగింగ్ ప్రక్రియ చేపట్టడంతోపాటు చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియనూ చేపడుతున్నది. ఇకపై ఏ చెరువు కూడా కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏటా చెరువుల ఎఫ్టీఎల్ భూములు తగ్గుతుండటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎఫ్టీఎల్ భూములు కబ్జాకు గురి కావడంతో గతేడాది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులు నిండి చాలా కాలనీలు నీళ్లతో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాం టి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉం డేందుకు ప్రభుత్వం ప్రతి చెరువునూ డిజిటల్ సర్వే చేయడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను చేపడుతున్నది. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే జియోట్యాగింగ్ పూర్తి
జిల్లాలోని అన్ని చెరువులకు సంబంధించి జియోట్యాగింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిం ది. జియోట్యాగింగ్ ప్రక్రియతో జిల్లాలో ఎన్ని చెరువులున్నాయి, చెరువుల ఫొటోలతోపాటు తూము, అలుగు వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు సేకరించి, వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. జియోట్యాగింగ్ ప్రక్రియ తో ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో జిల్లాలోని ఏ చెరువు ఎక్కడుంది, సంబంధిత చెరువు తూము, అలు గు పూర్తి వివరాలను సులువుగా తెలుసుకోవ చ్చు. అంతేకాకుండా చెరువుల నీటి నిల్వ సా మర్థ్యం కూడా పక్కాగా తెలిసిపోతుంది. అయితే ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ పూర్తైన తర్వాత మరోసారి ఆన్లైన్లో వివరాలను అధికారులు పొందుపర్చనున్నారు.
జిల్లాలో 2,329 చెరువులు..69 వేల ఎకరాల ఆయకట్టు..
రంగారెడ్డి జిల్లాలో 2,329 చెరువులుండగా.. 69,197 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలోని ఆయా డివిజన్లలోని చెరువులకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్లో 875 చెరువులుండ గా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 141, హయత్‌నగర్‌లో 7, ఇబ్రహీంపట్నంలో 122, మంచాలలో 301, యాచారంలో 137, సరూర్‌నగర్‌లో 5, బాలాపూర్‌లో 48, మాడ్గుల్ మం డలంలో 114 చెరువులున్నాయి. అదేవిధంగా శంషాబాద్ సబ్ డివిజన్లో 579 చెరువులుండగా 14,942 ఎకరాల ఆయకట్టు ఉంది. చేవెళ్ల డివిజన్లో మొత్తం 306 చెరువులుండ గా 9,671 ఎకరాల ఆయకట్టు ఉంది. షాద్‌నగర్ డివిజన్లో 579 చెరువులుండగా 19,996 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఇప్పటివరకు 2,146 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు
జిల్లాలోని చెరువులకు ఎఫ్టీఎల్(నీటి నిలువ సామర్థ్యం) గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలోని ఏ ఒక్క చెరువు కూడా కబ్జా బారిన పడొద్దన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి చెరువునూ సర్వే చేయడంతోపాటు ఆయా చెరువుల రికార్డులను పరిశీలించి ఎఫ్టీఎల్ భూమి ఎంత ఉందనే వివరాలను సేకరించి ఎఫ్టీఎల్ను గుర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులకు సర్వే నిర్వహించడంతోపాటు ఎఫ్టీఎల్ను గుర్తిస్తుండగా, ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం జిల్లా అంతటా నిర్వహించనున్నారు. జిల్లాలో 2,329 చెరువులుండగా 69 వేల ఎకరాల ఆయకట్టు ఉం ది.
ఇప్పటివరకు 2,146 చెరువులకు సంబంధిం చి ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. కాగా హెచ్ఎండీఏ పరిధిలో 1,078 చెరువుల్లో ఇప్పటివరకు 998 చెరువులకు సంబంధించి సర్వే పూర్తితోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ నూ అధికారులు పూర్తి చేశారు. అదేవిధంగా చేవెళ్ల ఎస్ఈ పరిధిలో మొత్తం 1,261 చెరువులుండగా ఇప్పటివరకు 1,148 చెరువులకు సం బంధించి ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ సాగుతున్నది. మిగిలిన చెరువులకు సంబంధించిన పనులను ఈనెలాఖరు లోపు పూర్తి చేసేందుకు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టా రు. అదేవిధంగా అన్ని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ భూములను గుర్తించడంతోపాటు మరోసారి అన్ని చెరువుల ఎఫ్టీ ఎల్ వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపర్చనున్నారు.
తుది దశకు ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ
జిల్లాలోని చెరువుల ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. ఈనెలాఖరు లోపు అన్ని చెరువులను సర్వే చేయడంతోపాటు ఎఫ్టీఎల్ పరిధిని కూడా గుర్తిస్తాం. జిల్లాలోని ఏ ఒక్క చెరువుకు సంబంధించిన భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎఫ్టీఎల్ గుర్తించిన తర్వాత మరోసారి అన్ని చెరువుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తాం.
– బన్సీలాల్, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ