DJ Sound | మొయినాబాద్, ఏప్రిల్13: వ్యవసాయానికి అనుబంధంగా రైతులు కోళ్ల ఫారంను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కోళ్ల ఫారం పక్కనే ఉన్న రిసార్టు ఆ రైతుల పాలిట షాపంగా మారింది. రిసార్టులో రికార్డు డ్యాన్స్‌లు చేయడానికి పెట్టుకున్న డీజే శబ్దానికి కోళ్లు బెదురుతున్నాయి. శబ్దాన్ని తట్టుకోలేక కోళ్లు భయపడి ఒక్క చోటకు గుంపుగా చేరి ఒకదాని మీద ఒకటి పడి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేసినా రిసార్టు యాజమాని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని కోళ్ల ఫారం రైతులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో తన సొంత పొలంలో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు గడ్డం వెంకట్‌రెడ్డి , సురేందర్‌రెడ్డి కోళ్ల ఫారంను ఏర్పాటు చేసుకున్నారు.
కోళ్ల ఫారం భూమిని ఆనుకుని ఉన్న బ్రీజీ పామ్ వెంచర్లో ఒక రిసార్టు ఉంది. రిసార్టులో సెలవు దినాల్లో పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈవెంట్లు ఏర్పాటు చేసినప్పుడు ఇష్టానుసారంగా డీజే సౌండ్ ఎక్కువగా పెడుతున్నారు. డీజే శబ్దానికి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లు బెదురుతున్నాయి. శబ్దానికి భయపడుతున్న కోళ్లు ఒకే చోటకు గుమిగూడి ఒక దాని మీద ఒకడి పడి మృత్యువాత పడుతున్నాయి.
100 కోళ్లు మృత్యువాత..
గత ఏడాది క్రితం రిసార్టులో ఇష్టానుసారంగా ఎక్కువ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేయడం వలన 2 కిలోల బరువు కలిగిన 100 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాదాపుగా రూ.20 వేల వరకు రైతులకు నష్టం వచ్చింది. అదే విధంగా రెండు నెలల క్రితం డీజే శబ్దానికి చిన్న కోడి పిల్లలు సుమారుగా 70 వరకు చనిపోగా రూ.3 వేల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే 70 కోళ్లు పెరిగిన తరువాత వాటి విలువ సుమారుగా రూ.20 వేల వరకు ఉంటుందని రైతులు పేర్కొన్నారు.
రెండు సార్లు కోళ్లు చనిపోయినప్పుడు రిసార్టును వేరేవాళ్లు నిర్వహించారు. కోళ్లు చనిపోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా రిసార్టు యాజమాని, నిర్వాహకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రిసార్టు యాజమాని, నిర్వాహకుల తీరు ఏ మాత్రం మారడం లేదని కోళ్ల ఫారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిసార్టు యాజమాని రిసార్టు నిర్వాహణ బాధ్యతలు సురేందర్‌రెడ్డి అనే వ్యక్తికి కొత్తగా లీజుకు ఇచ్చారు. గతంలో ఉన్న నిర్వాహకుని కంటే ఈ నిర్వాహకుడు ఇష్టానుసారంగా డీజే సౌండ్ పెట్టి ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అనే రీతిలో డీజే సౌండ్ పెడుతున్నారని రైతులు వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డిలు ఆరోఫించారు. గతంలో ఉన్న నిర్వాహకులు,యాజమానిపై చర్యలు తీసుకోకపోవడంతో కొత్తగా రిసార్టు నిర్వహిస్తున్న వ్యక్తి కూడా సెలవు రోజుల్లో పార్టీలు నిర్వహించి ఇష్టానుసారంగా డీజే సౌండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
శుక్రవారం ,శనివారం రోజుల్లో రాత్రి సమయంలో డీజే సౌండ్ ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు. దీంతో కోళ్లు బెదిరి ఒక్క చోటకు గుమిగూడినాయి. డీజే శబ్దానికి కోళ్లు ఒక్క చోటకు చేరడంతో తీవ్ర ఆందోళనకు చెందిన కోళ్ల ఫారం రైతులు అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజే సౌండ్‌ను ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న రిసార్టు నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకాడుతున్నారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోళ్ల ఫారం రైతులు వెంకట్‌రెడ్డి ,సురేందర్‌రెడ్డిలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకుంటే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్‌కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్