Inter Student | షాద్ నగర్, మార్చి 23: ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు అనే విద్యార్థి పట్టణంలోని ఓల్డ్ హైవే సీఎంఆర్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న ప్రైవేటు భవనంలో గల ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ పరీక్షలు రాశాడు. పరీక్షలు అయిపోయినా చందు హాస్టల్లోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తన గదిలో ఉన్న ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అది సక్సెస్ కాకపోవడంతో వసతీగృహంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకేశాడు. సీఎంఆర్ షాపింగ్ మాల్ అండర్ గ్రౌండ్ వద్ద చందు పడిపోవడం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే 108కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.