పరిగి : విద్యాభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో జరిగిన పీఆర్టీయూ టీఎస్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సర్కారు అనేక చర్యలు చేపట్టిందన్నారు. పాఠశాలల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఆధునీకరణ కోసం రూ. 4వేల కోట్లు ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. తద్వారా పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంఈవో హరిశ్చందర్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు శివకుమార్, గౌరవాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు.