హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ‘మమ్మల్ని ఖాళీ చేయమనే బదులు సీఎం రేవంత్‌రెడ్డిని ఇంత విషమిచ్చి చంపమనండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక పది రూపాయలు ఖర్చు పెడితే చాలు బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు.
ఆ పది రూపాయలతో ఇంత విషం తెచ్చి మేం తాగే నీళ్ల ట్యాంకులో కలిపితే అందరం పోతాం. అప్పుడు ఆయన హాయిగా రాజ్యమేలవచ్చు. ఎక్కడైనా ఇదే పని చేయమనండి.. ఆయనకు ఇబ్బంది లేకుండా అన్నీ తీసుకోవచ్చు’ అంటూ ఓ వృద్ధురాలు ఆవేదనతో మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అపార్ట్మెంట్లోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అపార్ట్మెంట్లోని 450 ఇండ్లలో దాదాపు 60శాతం మంది వృద్ధులు ఉన్నారు. సీఎం తీరుపై అపార్ట్మెంట్లోని ఓ వృద్ధురాలి కన్నీటి పర్యంతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర మండిపడుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసి విగ్రహాలు పెట్టడమేంటని నిలదీస్తున్నారు.