నాణ్యత లేని రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు ఏకంగా రూ.ఆరు కోట్ల బిల్లులు చెల్లించారు. రోడ్డు వేసిన మూడు నెలలకే తిరిగి మరమ్మతులు చేసి ప్యాచ్ వర్కులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో కారేపల్లి గ్రామం నుంచి పేరెపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల మేరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణానికి రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించారు. 2024 డిసెంబర్లో వైరా శాసన సభ్యుడు మాలోత్ రాందాస్‌నాయక్ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఓ పక్క నుంచి రోడ్డు నిర్మాణం సాగుతుండగానే పూర్తయిన ప్రాంతంలో రోడ్డు కుంగిపోతోంది. దీంతో నాణ్యత లోపించడంతో దానిని సరిదిద్దేందుకు ప్యాచ్ వర్కులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-మామిళ్లగూడెం, ఫిబ్రవరి 21
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో ఏడాది కాలంలోనే రోడ్డు కుంగిపోతోంది. కారేపల్లి గ్రామంలోని కుమ్రంభీం సెంటర్ నుంచి పేరెపల్లి రైల్వే గేటు వరకు నిర్మించిన రోడ్డులోని గ్రామాల మధ్య సీసీ రోడ్డు నిర్మాణం చేసి మిగిలిన ప్రాంతాల్లో బీటీ రోడ్డును నిర్మించారు. రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవినీతి.. గుంతల రూపంలో బయటపడుతోంది. రోడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షించాల్సిన ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు అవినీతిలో మునిగి తేలినట్లు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల ఉదాసిన వైఖరితో డివిజన్ స్థాయి అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేస్తున్న రోడ్ల నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. మామూళ్ల మత్తులో కూరుకున్న ఇంజినీరింగ్ అధికారులు.. ప్రజా రవాణాకు భద్రత కల్పించడంలేదనే ఆరోపణలొస్తున్నాయి.
తమది ప్రజాపాలనంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో రోజుకో అవినీతి బయటపడుతున్న వేళ.. ఆర్అండ్బీ శాఖలోని అవినీతి కూడా బయల్పడుతోంది. నూతన రోడ్డు నిర్మాణ సమయంలో పాత రోడ్డు మీద ఉన్న రేగడి మట్టి, చౌడు మట్టిని తొలగించకుండానే.. దెబ్బతిన్న బీటి రోడ్డును యంత్రాలతో తొలగించారు. నామమాత్రంగా గ్రావెల్ పోసి తూతూమంత్రంగా రోడ్డును నిర్మించారు. రోడ్డు నిర్మాణం చేసిన తరువాత నూతన రోడ్డుకు పక్కనే ఉన్న రేగడి మట్టి కాకుండా గ్రావెల్ పోయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ మాత్రం పంట పొలాల్లో ఉన్న రేగడి మట్టి తెచ్చి పోసి చేతులు దులుపుకున్నాడు. రోడ్డు వేసిన కొద్ది రోజులకే స్థానికులు ఆర్అండ్బీ వైరా డీఈఈ, ఏఈఈ, ఖమ్మం ఈఈలకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఇదే విషయంపై స్థానికులు నేరుగా నిలదీసినప్పటికీ వారికి ఏఈఈ దురుసుగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నాణ్యత లేని రోడ్డు నిర్మాణంపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

విచారణకు కలెక్టర్ ఆదేశం
సింగరేణి మండలంలో కారేపల్లి నుంచి పేరెపల్లి వరకు నిర్మించిన రోడ్డు.. ఏడాది లోపే గుంతలమయం కావడంతో స్థానికులు పూర్తి ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్‌ను మందలించారు. రోడ్డు నిర్మాణంపై విచారణ చేసి సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా తనకు ఇవ్వాలంటూ ఆదేశించారు. నాణ్యత లేని రోడ్డును నిర్మించినప్పటికీ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు సహకరించిన ఈఈ, ఏఈఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు.
దెబ్బతిన్న రోడ్డును మళ్లీ నాణ్యంగా నిర్మించాలి
దెబ్బతిన్న రోడ్డును నాణ్యతా ప్రమాణాల ప్రకారం మళ్లీ నిర్మించాలి. ఈ రోడ్డు నిర్మాణంలో అవినీతికి పాల్పడి నాణ్యత లేకున్నా మిన్నకుండిపోయిన ఆర్అండ్బీ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిర్మాణ సమయంలో ఆ శాఖ అధికారులు నాణ్యతను పరిశీలించకపోవడమే వారు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఆధారం.
-వాసిరెడ్డి సంపత్‌కుమార్, కారేపల్లి వాసి
కలెక్టర్ ఆదేశాల మేరకు నివేదిక ఇస్తాం
కారేపల్లి – పేరెపల్లి మార్గంలో ప్రస్తుతం ఇంకా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు ఆ రోడ్డు మార్గంలో ఉన్న వివిధ గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపడతాం. తరువాత పూర్తి నివేదికలను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తాం.
-యాకూబ్, ఆర్అండ్బీ ఎస్ఈ, ఖమ్మం