హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి(54)కి బుధవారం ఉదయం మరోమారు న్యూరో అసెస్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును అంచనా వేయనున్నట్టు యశోద హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జీ విజయ్‌కుమార్ అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఆయనకు వెంటిలేటర్‌పై శ్వాసక్రియ అందిస్తున్నారు.
క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణుల బృందం నిరంతర పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్టు (అనాక్జిక్ డ్యామేజ్)ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో తేలిందని, ప్రస్తుతం ఆయన శబ్దాలకు, స్పర్శకు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని వైద్యులు పేరొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాపాడేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని దవాఖాన యాజమాన్యం తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో అకడి వైద్యుల సూచనల మేరకు నిరంతరం చికిత్స అందిస్తున్నామని డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. దవాఖానకు వెళ్లిన మంత్రి పొంగులేటి, సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.