జగిత్యాల, జూలై 28 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటర్ వరకు చదివాడు. బతుకుదెరువు కోసం దాదాపు ఇరవై ఏండ్ల క్రితమే బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్‌మాల్‌లో బాయ్‌గా చేరాడు. వసతి కల్పించి, వేతనం మంచిగా ఇవ్వడంతో కష్టపడి పనిచేశాడు. రెండుమూడేండ్లు గడిచే సరికి షాపింగ్‌మాల్ యజమానికి శ్రీనివాస్‌పై నమ్మకం కుదరడంతో ఉద్యోగ స్థాయి, వేతనం పెరిగాయి. దీంతో శ్రీనివాస్ కుటుంబ సమస్యలు తీరిపోయాయి. శ్రీనివాస్ పెండ్లి కూడా చేసుకున్నాడు. రెండేండ్లకోసారి సొంతూరికి వచ్చి నెల, రెండునెలలు ఉండే అవకాశాన్ని పొందాడు. అలాగే తనపై ఆధారపడి ఉన్న ఇద్దరు తమ్ముళ్లను చదివించి ప్రయోజకులను చేశాడు. శ్రీనివాస్‌కు ఇద్దరు పిల్లలు అయ్యారు. చూస్తుండగానే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. శ్రీనివాస్ షాపింగ్ మాల్లో బాయ్ స్థాయి నుంచి సూపర్వైజర్ స్థాయికి చేరుకున్నాడు.
అయితే మూడు, నాలుగు నెలల నుంచి పరిస్థితులు తారుమారయ్యాయి. మధ్య తూర్పులో ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం శ్రీనివాస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్ నుంచి వచ్చిపడుతున్న డ్రోన్దాడులకు బహ్రెయిన్ దేశం అతలాకుతలం అవుతున్నది. శ్రీనివాస్ పనిచేస్తున్న షాపింగ్ మాల్‌తోపాటు బహ్రెయిన్‌లో ఉన్న అనేక కంపెనీలు, దుకాణాల ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయాయి. మూడు నెలలుగా శ్రీనివాస్‌కు రావాల్సిన వేతనాన్ని షాపింగ్‌మాల్ యాజమాన్యం నిలిపివేసింది. ఇది ఒక్క శ్రీనివాస్‌కు సంబంధించిన సమస్యనే కాదు.. తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం వెళ్లిన లక్షలాది మంది గల్ఫ్ కార్మికుల పరిస్థితి. మధ్య తూర్పులో చోటుచేసుకుంటున్న యుద్ధ తీవ్రత, ఉద్రిక్తతలు, దాడులు తెలంగాణ పల్లెలపై ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఉపాధి కోసం ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. 1970 దశకం మధ్య నుంచి బతుకుదెరువు కోసం ఎడారిదేశాల బాటపట్టడం ఆరంభించారు. 1977 ప్రాంతంలో ప్రారంభమైన వలసలు 2018 వరకు పెరుగుతూనే వచ్చాయి. అయితే 2018 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా నీటి పారుదల రంగాన్ని మెరుగుపర్చడం, చెరువుల మరమ్మతులు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం లాంటి చర్యలతో వలసల్లో కొంత తగ్గుదల నమోదైంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే విదేశీ మారక ద్రవ్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పక తప్పదు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా జిల్లా తలసరి ఆదాయంలో గల్ఫ్ కార్మికుల వాటానే ఎక్కువగా ఉన్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి నుంచి కార్మికులు వివిధ మార్గాల ద్వారా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులను తమ కుటుంబాలకు పంపిస్తున్నారు. విదేశాల నుంచి డబ్బులు వస్తున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం పన్నుల రూపంలో అధిక ఆదాయం సమకూరుతున్నది. విదేశీ డబ్బు కావడం, ఇదంతా డాలర్ విలువతో అంచనా వేస్తుండటంతో మన రూపాయి బలపడే విషయంలో గల్ఫ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
తెలంగాణ కార్మికులు మూడు నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న విభేదాలు గల్ఫ్ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడారి దేశాలన్నీ ఇరాన్-ఇజ్రాయిల్ దేశాలకు సమీపంలో ఉండటం, ఇరాన్ ఆధీనంలో హోర్మూజ్ జలసంధి ఉండటం, ఎడారి దేశాల్లో అమెరికాకు చెందిన సైనిక శిబిరాలు ఉండటం గల్ఫ్ కార్మికులకు సమస్యగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వేతనంలో ఇప్పుడు సగం కూడా రావడం లేదని కార్మికులు తమ కుటుంబాలకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు ప్రాణభయం సైతం ఇబ్బందులు పెడుతున్నదని, ముఖ్యంగా దుబాయ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధ డ్రోన్లు కనిపిస్తున్నాయని భయాందోళనలను వ్యక్తంచేస్తున్నారు. కాగా కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీల్లో, షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న వారి పరిస్థితి కంటే ఆజాద్ వీసాపై వెళ్లి పనిచేసుకుంటున్న కార్మికుల పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నట్టు కార్మికులు చెప్తున్నారు. టూరిస్ట్ వీసాలు, ట్రాన్సిట్ వీసాలపై వెళ్లి అక్కడ పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారూ నిద్రలేని రాత్రులను గడుపుతున్నామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరిస్తున్నారు.
న్యూఢిల్లీ, జూలై 28 : గత మూడేండ్లలో విదేశాల్లో 1,900 మందికి పైగా భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. 2023-2025 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 70 శాతం (1,340) మంది గల్ఫ్‌లోనే ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ మంగళవారం సభలో తెలిపారు. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 511, సౌదీ అరేబియాలో 354, కువైట్‌లో 162, ఒమన్‌లో 146, బహ్రెయిన్‌లో 101, ఖతార్‌లో 66 మంది ఉన్నారు.

అలాగే మలేషియాలో 131, యూఎస్‌లో 62 మంది, తర్వాత స్థానాల్లో ఇటలీ, కెనడా, యూకేల్లో 30 మంది చొప్పున ఉందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం కోటి మంది వరకు భారతీయులు ఉన్నారని తెలిపారు. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే విదేశాల్లో ఆత్మహత్యలు చేసుకున్న భారతీయుల సంఖ్య పెరిగింది. 2014-2022 మధ్య వీరి సంఖ్య 4,005 ఉంది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల కోసం ప్రవాసీ భారతీయ బీమా యోజన (పీబీబీవై) లాంటి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
విదేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లిన కార్మికుల వివరాలను విదేశాంగశాఖ ప్రకటించింది. బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటా సగటున 3.90 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎడారి దేశాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 1.61 లక్షల మంది మాత్రమే కొత్త వారు వెళ్లారని ప్రకటించింది. రానున్న నాలుగు నెలల్లోనూ కొత్త వారు బతుకుదెరువు కోసం వెళ్లకపోవచ్చని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.