హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ఇదే వరుసలో చేరిందని మండిపడుతున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ పథకం కింద ప్రస్తు తం రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులకు 17 జిల్లాల్లోని 153 దవాఖానల్లో ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. హైదరాబాద్లో 47, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 21, రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్లో జిల్లాలో 13, హనుమకొండ జిల్లాలో 12, మిగిలిన జిల్లాలో 46 దవాఖానలు ఈ సేవలు అందజేస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని ట్రస్టు బోర్డు అధికారులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ ట్రస్టు సభ్యు లు తాజాగా తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నేతలతో సమావేశమయ్యారు. ఈహెచ్ఎస్ సేవలను 17 సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అమలు చేయాలని కోరడంతో ప్రస్తుతానికి కాంటినెంటల్ (గచ్చిబౌలి), కిమ్స్ దవాఖానల్లో ఈహెచ్ఎస్ సేవలు అందిస్తామని అసోసియేషన్ నేతలు చెప్పారు. దీంతో ఇప్పటికే తమ డీఏ బకాయిలు, పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈహెచ్ఎస్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను కూడా వాయిదా పద్ధతిలో చేర్చడం విడ్డూరంగా ఉన్నదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈహెచ్ఎస్ కోసం ఇప్పటికే తమ నుంచి 2 నెలల ప్రీమియంను వసూలు చేసిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకెప్పుడు పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.