Gali Kuntu Vaccination drive | నవాబుపేట, ఏప్రిల్16 : కేంద్ర ప్రభుత్వం పశు సంపదను పెంచాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు నివారణ టీకాలను ప్రతీ రైతు కూడా తన పశువులకు వేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వి. సదానందం తెలిపారు. బుధవారం నవాబుపేట మండల కేంద్రంలో స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ కె విశ్వనాథ్‌తో కలిసి 30 పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను వేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సదానందం మాట్లాడుతూ.. తమ పశువైద్య సిబ్బంది ఇటీవలి కాలంలో చేసిన పశుగణనలో మండంలో 5 వేల పశువులు ఉన్నట్లు (ఆవులు, ఎద్దులు, గేదెలు) గుర్తించామని వాటి ఆధారంగానే మండలంలో పశువైద్య సిబ్బందిని మూడు టీమ్‌లుగా ఏర్పాటుచేశామని.. వారి ద్వారానే టీకాలు వేయిస్తున్నట్లు తెలిపారు.
తమ సిబ్బందిని 1. ఏక్మామిడి 2. యెల్లకొండ 3. నవాబుపేట టీమ్‌లుగా ఏర్పాటుచేశామని.. వారు తమకు కేటాయించిన గ్రామాల్లోని ప్రతీ ఇంటికి తిరిగి పశువుల వివరాల ఆధారంగా టీకాలను ఇస్తున్నారన్నారు. టీకాలు వేసే సిబ్బందికి తమ డిపార్ట్మెంట్ తరపున రవాణా చార్జీలు కూడా ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు గుర్తుజేశారు. పశువు మూడు నెలలు ఉన్నది అన్నప్పటి నుంచి ఉచిత గాలుకుంటు నివారణ టీకాలు సంవత్సరంలో రెండుసార్లు ఆరు నెలలకు ఒక్కసారి ఇస్తున్నట్లు సదానందం తెలిపారు.
మే 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకా..
పశువుల కోసం పశుగ్రాసాన్ని కూడా తమ డిపార్ట్మెంట్ అందజేస్తుందని.. దీనిని కూడా రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మే 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు నవాబుపేట పశు వైద్యాధికారి డాక్టర్ కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. మండలంలో పశువుల సంపదను పెంచాలనే అక్కడ అక్కడా రైతులకు అవగాహన వంటి కార్యక్రమాలను కూడా గతంలో నిర్వహించామని.. ఇపుడు కూడా టీకాలు వేస్తున్న సందర్భాల్లో రైతులకు గుర్తుజేయడం జరుగుతుందన్నారు.
పశువులతో చేసిన వ్యవసాయానికి, యంత్రాలతో చేసిన వ్యవసాయానికి చాలా తేడా ఉంటుందని అందుకే పాలిచ్చే పశువులను మొదలుకుని.. బర్రెలను కూడా కాపాడుకోవాలని అప్పుడే పశువు సంపదను కాపాడినట్టు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె విశ్వనాథ్, సిబ్బంది కనకారాణి, శ్రీరాములు గౌడ్, శ్రీనివాస్, వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్