పరిగి, ఏప్రిల్ 14 : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోకుండా చూడాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. మీరు ప్రసాదించిన రాజ్యాంగం కల్పించిన హక్కులతో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్న మేము, నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, తర తరాలుగా సాగు చేసుకుంటున్న మా భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరుతో గుంజుకునేందుకు సర్కారు చూస్తుందని, భూసేకరణ రద్దు చేసేలా చూడాలంటూ వినతిపత్రం అందించారు.
పచ్చని పొలాల మధ్య పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని పేర్కొన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదం, రైతుల అంగీకారం లేకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. అనంతరం భూ సేకరణ జరగకుండా ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిగా రైతులు మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతాంగం తరపున పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.