నవాబుపేట, మే11: గత ప్రభత్వ హయాంలో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజలు చెప్పిన సమస్యను వెనువెంటనే తీర్చి చక్కని వాతావరణాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ ఉండేది. ఇప్పడది పూర్తిగా కనుమరుగైన దృశాలను నవాబుపేట మండల పరిధిలోని మాదారం గ్రామంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలా చెపుకుంటూ పోతే మాదారంలో సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ ప్రధానమైన పారిశుద్ధ్య సమస్యను తీర్చండి సార్ అంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గ్రామ సమస్యలను ఎన్నోసార్లు మాజీ ప్రజాప్రతినిధులకు, మండలంలోని సంబంధిత అధికారులకు, పంచాయతీ సెక్రటరీకి చెప్పినా కూడా వారు చేస్తాం, చూస్తాం అనే మాటలతో సరిపెడుతున్నారు తప్ప చేసింది ఏంలేదని గ్రామస్తులు ఎవ్వరికి తోచ్చిన రీతిలో వారు తమ వార్డుల్లోని సమస్యలను ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చెత్తాచెదారం, డ్రైనేజీలపై సరైన మూతలు లేక రోడ్డుపై మురుగు నీరు పారడం, దానివల్ల దోమలు, ఈగలు వచ్చి అనేక రోగాలకు దారితీసే అవకాశాలు ఉన్నా కూడా గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యం చూస్తుంటే ఏంచెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉందని మాదారం గ్రామస్తులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కొన్ని వార్డుల్లో అయితే అండర్ డ్రైనేజీపై ఉన్న మ్యాన్‌హోల్ పైకప్పులు కూడా వేయకపోవడంతో రాత్రి పూట పాదచారులు అందులో పడే ప్రమాదం ఉంది. ఇండ్ల వద్ద ఉన్న చిన్న పిల్లల పరిస్థితి ఏమిటి రోడ్లుపై ఉన్న మ్యాన్వోల్పై కపులు వేస్తే బాగుండేది జరుగబోయో ప్రమాదాలను నివారించే వారవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రైనేజీలపై బ్లీచింగ్ పౌడర్‌ను దోమలు, ఈగలు రాకుండా చల్లి పరిశుభ్రతకు పాటుపడే వ్యవస్థ ఉండే. ఇప్పుడు అది కూడా చల్లడం మానేశారు. అంటే పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో కండ్లకు కనిపిస్తాలేదా అని అప్పటి ప్రభుత్వంలో చూసిన పరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులను గ్రామస్తులు గుర్తుజేస్తున్నారు. ఇండ్లల్లో ఉండే తడి, పొడి చెత్తను ఇండ్ల మధ్యనే చల్లడంతో అనేక రోగాలు వ్యాప్తి చెందడానికి కారణం అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని పారిశుద్ధ్య సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.