వికారాబాద్, ఆగస్టు 17 : వికారాబాద్ శ్రీ అనంతపద్మనాభస్వామిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. సెలవు దినం కావడంతో హైదరాబాద్ నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో సేదతీరారు. అనంతరం అనంతగిరిలోని పచ్చనిఅందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వచ్చారు. చల్లని వాతావరణం, పచ్చని కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడిపారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనంతగిరి వచ్చిన పర్యాటకులు పచ్చని ప్రకృతిని ఆస్వాదించారు. అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. వాచ్ టవర్, గ్రీనరీ, నంది విగ్రహం, వ్యూ పాయింట్ తదితర ప్రదేశాలను చూస్తూ పర్యాటకులు సంతోషంగా గడిపారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ ప్రకృతి అందాన్ని తమ సెల్ఫోన్లో బంధించారు.