కొడంగల్, జనవరి 29 : మున్సిపల్ ఎన్నిల నేపథ్యంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించే విధంగా అధికారులు పూర్తి బాధ్యత వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. గురువారం కొడంగల్‌కు విచ్చేసిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. నామినేషన్ ప్రక్రియలో ఏలాంటి లోటుపాట్లు లేకుండా అన్నింటా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
అభ్యర్థుల నామినేషన్‌కు సంబంధించి ధృవీకరణ పత్రాలు జతచేయాల్సిన వాటిని స్పష్టంగా తెలియజేయాలని ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి 4 నామినేషన్ కౌంటర్లు 8 మంది ఆర్వోలు నియమించడం జరిగిందని, సొంత నిర్ణయాలు కాకుండా అభ్యర్థులు అధికారులను సంప్రధించి సలహాలను అందుకోవాలని తెలిపారు. నామినేషన్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్‌తో పాటు పోటీసు బందోబస్తు పకడ్బందీగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.