వికారాబాద్, ఏప్రిల్ 30 : ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే జీవితంలో ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం పదవీ విరమణ పొందుతున్న షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, యువజన క్రీడల అధికారి హనుమంతరావు, యాలాల్ తహసిల్దార్ అంజయ్యకు జిల్లా యంత్రాంగం తరఫున పదవీ విరమణ ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికి రాదని, వచ్చిన వాళ్లు చాలా అదృష్టవంతులన్నారు.
ఉద్యోగ బాధ్యతలో భాగంగా సర్వీసులో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందడం పదవీ విరమణ సమయంలో ఎంతో తృప్తిని కలిగిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మీరు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని అవసరమైన సమయంలో మీ సేవలను తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పదవీ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డిఆర్డిఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, డిబిసిడబ్ల్యూఓ ఉపేందర్, డిఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డిపిఓ జయసుధ, డీఈఓ రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.