ధారూరు, మే 28 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు చేరవేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ‘తడిసి, మొలకలొచ్చి’ అనే వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ గిడ్డంగి ఆవరణలో ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగానే వచ్చినందుకు వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
దీని వల్ల ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు అదనంగా లారీలను, హమాలీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కొనుగోలు సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.