వికారాబాద్, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ ప్రభుత్వంలో పశువులకు కూడా గోస తప్పడంలో లేదు. వేసవి కాలంలో నీటి తొట్లను నింపకపోవడం వల్ల తాగునీరు దొరక్క పశువులు అల్లాడిపోతున్నాయి. నీటి తొట్ల నిర్వహణను గతంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం చూసుకునేవి.. కానీ ఇప్పుడు ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో మూగజీవాలు దాహార్తితో అలమటిస్తున్నాయి.
వేసవి కాలంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గత ప్రభుత్వం పశువుల నీటి తొట్లను ఏర్పాటు చేసింది. వేసవి కాలం వచ్చిందంటే గ్రామపంచాయతీల్లోని పాలక వర్గాలు ఈ నీటి తొట్లను నింపేవారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం వెల్చాల్లో కూడా పశువులు నీటిని తాగడం కోసం రెండు తొట్లను ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణను గ్రామ పంచాయతీ పాలకవర్గం చూసుకునేది. కానీ రెండేండ్ల క్రితం వాటి పదవీకాలం ముగిసింది. సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించకపోవడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలననే కొనసాగుతోంది. అయితే ప్రత్యేక అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువుల తొట్లు నీరు లేక నిరుపయోగంగా మారిపోయాయి. ప్రత్యేకాధికారులు, సంబంధిత అధికారులు గ్రామంలో పర్యవేక్షణ చేయకపోవడమే ఇందకు కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఎండలు మండిపోతుండటంతో నీటికోసం పశువులు అవస్థలు పడుతున్నాయని పశు పోషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లను నీటితో నింపితే మూగజీవాలకు దాహార్తిని తీర్చిన వాళ్లవుతారని కోరుతున్నారు.