పరిగి, అక్టోబర్ 26 : ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధన చేయాలని టీఓఎస్ఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అరుణ శ్రీ సూచించారు. ఆదివారం పరిగిలోని జెడ్పీహెచ్ఎస్ నెం.1, జెడ్పీహెచ్ఎస్ నెం.2లను ఆమె సందర్శించి ఓపెన్ స్కూల్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అందించాల్సిందిగా ఫ్యాకల్టీకి సూచించారు. తద్వారా మరింత సులువుగా అర్థమవుతుందని చెప్పారు.
ఓపెన్ స్కూల్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా ప్రతిరోజు ఇంటి దగ్గర కనీసం గంట సమయం కేటాయించి చదువుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కనీసం నియోజకవర్గ స్థాయిలో ఒక పరీక్షా కేంద్రం ఉంచితే అందుబాటులో ఉంటుందని పలువురు రాష్ట్ర కో-ఆర్డినేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం.గోపాల్, ఓపెన్ స్కూల్ల ప్రధానోపాధ్యాయులు, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.