Vikarabad | వికారాబాద్, మార్చి 9 : ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పాలన తీరు. అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రి, స్పీకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు… కానీ పనులు మరిచారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణంకు రూ.6 కోట్లు కేటాయించారు. గతేడాది ఆగస్టు 5న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి శిలాఫలకం వేశారు. ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా రూ.6 కోట్లతో జీప్లస్ 1 భవనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. త్వరగా పనులు పూర్తి అయితే ఉపయోగంలోకి వస్తుందని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. శిలాఫలకం వేసి దాదాపుగా 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. స్పీకర్, సంబంధిత మంత్రి వచ్చినా కూడా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యతతో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.