ఇబ్రహీంపట్నం రూరల్/వికారాబాద్, అక్టోబర్ 28 : ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.8,300కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయం గేటుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మస్కు చరణ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వంశీ, తరంగ్, విప్లవ్‌కుమార్, లక్ష్మణ్, మధు, సంపత్, సందీప్, విక్కీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, జిల్లా కార్యదర్శి సతీశ్ పాల్గొని మాట్లాడారు. జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జిల్లాలో విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు.
కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఉన్నత విద్యకు దూరమయ్యే దుస్థితి నెలకొన్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి, అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాకేశ్, నగేశ్, పవన్, అరవింద్, మధు, సిరియాల టౌన్ ప్రెసిడెంట్ తేజ, సిద్ధు, రేహన్, ప్రదీప్, బద్రీనాథ్, పాండురంగారెడ్డి, శివ చైతన్య, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.