Wayanad : కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) లో కొండచరియలు విరిగిపడిన కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ (Congress party) అండగా నిలిచింది. లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Vadra) కలిసి బాధితుల కోసం నిర్మించనున్న 100 ఇళ్ల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. చురల్మల-ముండక్కాయ్ విపత్తు బాధితులకు ఈ ఇళ్లను నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఈ విపత్తు వయనాడ్ ప్రజల ధైర్యాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి చూపిందని రాహుల్‌గాంధీ అన్నారు. వారు చాలా కోల్పోయారని, కానీ ధైర్యాన్ని, మానవత్వాన్ని కోల్పోలేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన సోదరి ప్రియాంకతో ప్రయాణంలో జరిగిన ఓ సరదా సంఘటనను పంచుకున్నారు.
‘నేను మా సోదరితో సరదాగా ఏదో అన్నాను. అప్పటి నుంచి ఆమె నాతో మాట్లాడలేదు. ఇక్కడ ఫ్లైట్‌లో నుంచి దిగేవరకు ముభావంగానే ఉంది. కానీ వాయనాడ్‌లో అడుగుపెట్టగానే ఆమె మారిపోయింది. అదే వాయనాడ్ మ్యాజిక్. మాకు వాయనాడ్ ప్రత్యేకం’ అని రాహుల్‌గాంధీ సభలో చెప్పడంతో నవ్వులు పూశాయి. ఈ ప్రాంతంతో తమకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని ఆయన స్పష్టంచేశారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. జూలై 30న విపత్తు జరిగిన వెంటనే తాను ఆ ప్రాంతానికి వెళ్లినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆ రోజు తాను చూసిన దృశ్యాలను తన జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ఇళ్లు, జీవనోపాధి, వ్యాపారాలు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి తనను కలచివేసిందని చెప్పారు. అప్పటికి, ఇప్పటికి తాను మీ కుటుంబంలో ఒకరిగా మారిపోయానని భావోద్వేగంగా అన్నారు.
ఈ సమస్యను తాము పార్లమెంటులో ప్రస్తావించామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరామని ప్రియాంక తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నిలిచారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి కుటుంబానికి 8 సెంట్ల స్థలంలో 1,100 చదరపు అడుగుల ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. అలాగే నష్టపోయిన 40 మంది దుకాణదారులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకోవడానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.