వికారాబాద్, ఏప్రిల్ 11 : ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం ద్వారా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారన్నారు.
ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే బాధితుడి వాంగ్మూలాన్ని వారి భాషలో నమోదు చేసి, చదివి వినిపించి సంతకం తీసుకొని అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రతిని అందజేస్తారని చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ, ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో కేసులు., ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు., బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తారు.
అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని, సాక్ష్యాలను సేకరించే చర్యలు వెంటనే ప్రారంభిస్తారన్నారు. ఈ విధానం వల్ల ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ఆలస్యం తగ్గుతుందని, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తున్నారని ఆమె తెలిపారు.