వికారాబాద్, జనవరి 2 : జిల్లాలో కొత్త మెనూ ప్రకారం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వంట సామగ్రి ఏర్పాటు, వంటకు ఉపయోగించే సరుకులు, కూరగాయలన్నింటిలో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శాఖలవారీగా రేట్ చార్ట్ ప్రకారం కొత్త మెనూను పాటించాలని అధికారులకు ఆదేశించారు. హాస్టళ్లలో మైనర్ రిపైర్స్ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో కుక్కల బెడదను నివారించడానికి జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో 4 ఏబీసీ సెంటర్లను నెలకొల్పి స్థానిక పశువైద్యులతో కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 700 కుక్కలకు వరకు ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం, బీసీ అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్‌రెడ్డి, మైనార్టీ అధికారి హనుమంతరావు పాల్గొన్నారు.