రంగారెడ్డి, జూలై 18(నమస్తే తెలంగాణ) /వికారాబాద్ : పంట రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా గురువారం సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించారు. ఆయా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చేసి సీఎం రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శంషాబాద్ మండలం మల్కాపురం గ్రామంలోని రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మోమిన్‌పేట మండలంలోని రైతు వేదిక నుంచి పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గీతా రెడ్డి, గోపాల్, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరై సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్లు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి అర్హత కలిగిన ప్రతి రైతుకూ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.