రంగారెడ్డి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్యూలో నిరీక్షిస్తున్నారు. జిల్లాలో సుమారు 1,24,000పైగా ఎకరాల్లో వరి, మరో లక్ష ఎకరాల్లో పత్తిని సాగైంది. ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువగా పై పంటలను రైతులు సాగుచేశారు. అయితే ప్రభు త్వం 20,000 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుందని భావించగా.. సాగైన పంటలకు మాత్రం సుమారు 50,000 మెట్రిక్ టన్నుల యూరి యా అవసరముందని రైతులు పేర్కొంటున్నారు.
కాగా, ఇప్పటివరకు జిల్లాకు 15,000 నుంచి 16,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్ర మే సర్కారు సరఫరా చేయడంతో.. అవి అన్నదాతలకు సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు యూరియాకు పెద్ద ఎత్తున సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కో సహకార సంఘానికి రెండు రోజులకొ కసారి ఒక్క లారీ యూరియా మాత్రమే వస్తుండడంతో అది ఏమాత్రం సరిపోవడం లేదు. రోజంతా లైన్లో నిరీక్షించినా యూరియా దొరకని దుస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
గురువారం జిల్లాలోని పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులుదీరారు. వచ్చిన ఒక్కొక్క లారీ సగం మందికి కూడా సరిపోకపోవడంతో వారు చేసేదేమీ లేక నిరాశతో తిరిగి ఇండ్లకెళ్లారు.
ఉప్పరిగూడ సహకార సంఘం వద్ద గురువారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులుదీరారు. ఒకే లారీ యూరియా రావడంతో అక్కడున్న రైతులకు ఏ మాత్రం సరిపోలేదు. అప్పటికే యూరియా కోసం లైన్లో పడిగాపులు కాసిన రైతుల్లో సగం మందికే దొరికింది. యూరియా దొరుకని వారంతా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పారు. ఇబ్రహీంపట్నంలోని ఉప్పరిగూడ, శేరిగూడ, రాందాస్‌పల్లి, సీతారాంపేట తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో ఇంటికెళ్లారు. అలాగే, కడ్తాల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. అక్కడా రైతులకు యూరియా అందలేదు. అలాగే, ఆమనగల్లు మండల కేంద్రంలోని ఆగ్రో రైతుసేవా కేంద్రం వద్ద కూడా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున నిరీక్షించారు. కందుకూరు మండలంలోనూ యూరియా సరిపడా అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
కడ్తాల్ : అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. గురువారం యూరియా పంపిణీ చేస్తారన్న విషయం తెలుసుకున్న రైతులు.. ఉదయం ఆరు గంటలకే మండల కేం ద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కేంద్రం గోదాం వద్దకు వచ్చి క్యూలో నిరీక్షించారు. కడ్తాల్ పీఏసీఎస్‌కు 440 యూరియా బస్తాలు, రావిచేడ్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225, కడ్తాల్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225 యూరియా బస్తాలు వచ్చాయి. రైతులు అధికంగా ఉండడంతో అధికారులు పోలీసు పహారాలో ఒక్కో రైతుకు 2 సంచుల చొప్పున యూరియాను పంపణీ చేశారు. చాలామంది రైతులు తమకు యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. వ్యవసాయంపై ప్రభుత్వానికి అవగాహన, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు.
నందిగామ : యూరియా కొరత అన్నదాతలను వేధిస్తున్నది. మండలం లో 9,813 మంది, కొత్తూరు మండంలో 9,200 మంది రైతులుండగా.. రెండు మండలాల్లో సుమారు 30,000 ఎకరాల పైచిలుకు సాగు విస్తీర్ణం ఉన్నది. రెండు మండలాల్లో నందిగామ, చేగూరు, మేకగూడ సొసైటీల్లో యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. గురువారం మేకగూడ సొసైటీకి యూరియా వస్తుందనే సమాచారంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారు జామునుంచే వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని క్యూలో నిరీక్షించారు. లారీ లో 450 సంచులు మాత్రమే రావడంతో పోలీసు బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
యూరియా కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా. ఈ రోజు ఉదయం నుంచి క్యూలో ఉంటే రెండు బస్తాలే ఇచ్చారు. నేను వేసిన మొక్కజొన్న పంటకు ఈ యూరియా సరిపోదు. ఇంకా ఇవ్వమంటే తర్వాత లోడ్ వచ్చినప్పుడు ఇస్తామంటున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడే పంటలకు యూరియా వేయాలి. ఇప్పుడు యూరియా ఇవ్వకపోతే పంటలు సరిగ్గా పండక నష్ట ్టపోవాల్సిన వస్తుంది. ప్రభుత్వం స్పందించాలి. – పాండు, రైతు, సంఘీగూడ, నందిగామ మండలం
మొక్కజొన్నకు యూరియా వేద్దామంటే దొరకడంలేదు. కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా. మేకగూడ సొసైటీకి యూరియా వచ్చిందని తెలుసుకుని..క్యూలో నిల్చుంటే ఒక్క బస్తా కూడా అందలేదు. అయిపోయింది తర్వాత వచ్చినప్పుడు రండి ఇస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. పైసలు పెట్టి కొందామన్నా దొరకడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు ఈ యూరియా కష్టాలు. -రాజేందర్, రైతు, మేకగూడ, నందిగామ మండలం
మంచాల : మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద గురువారం ఉదయం నుంచే వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించగా కొందరికే యూరియా దొరికింది. మంచాల సహకార సంఘానికి లారీలో 444 బస్తాల యూరియా వచ్చింది. అంతకు రెట్టింపుగా రైతులు అక్కడికి రావడంతో యూరియా కోసం కొద్దిసేపు ఒకరిని ఒకరు తోచుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేయడంతో ముందు వరుసలో ఉన్నవారికే ఎరువు దొరికింది.