ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల నిర్వాహకుల అనేక కొర్రీలు.. హమాలీలు, లారీల కొరత ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర అడ్డంకిగా మారి.. కేంద్రాల వద్దే అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. అంతేకాకుండా అకాల వర్షాలు రైతన్నను మరింత కుంగదీస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు తేమ పేరుతో ధర తగ్గించడంతోపాటు తూకాల్లో మోసాలకూ పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
– రంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. అన్నదాతలు ధాన్యం విక్రయం కోసం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్ తదితర మండలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున వడ్లను తీసుకొచ్చి నిల్వ చేశారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కురిసిన వానతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. కాగా, తడిసిన ధాన్యాన్ని తీసుకు నేందుకు కేంద్రాల నిర్వాహకులు ఆసక్తి చూపకపోవడంతో వడ్లకు మొలకలు వచ్చి.. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంటుందని.. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్నీ కొనేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తూకం వేసేందుకు హమాలీలు.. కాంటా వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు లారీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు లారీలు సక్రమంగా రాకపోవడంతో అక్కడ ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో కొను గోలు కేంద్రాల నిర్వాహకులు ఆ నిల్వలు రైస్ మిల్లులకు తరలిన తర్వాతే ఇతర వడ్లను కొంటామని అన్నదాతలకు చెబుతుండడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా హమాలీలు సరిపడా లేకపోవడంతో కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా సాగడంలేదు. దీంతో అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తున్నది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్న తరుణంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి అన్నదాతలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ధాన్యాన్ని విక్రయానికి తీసుకొస్తే .. కేంద్రాల నిర్వాహకులు పలు కొర్రీలు పెడుతుండడంతో రైతన్నలు అక్కడే రోజుల తరబడిగా నిరీక్షించాల్సి వస్తున్నది. దీంతో కేంద్రా ల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి.