కవాడిగూడ, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో బీసీల ఐక్యతను సర్కార్ గుర్తించేలా ఉద్యమిద్దామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా ప్రభుత్వం నెరవేర్చిందా అని ప్రశ్నించారు. కేవలం ఓటు బ్యాంక్‌గానే బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు న్యాయం చేసేలా కేటాయింపులు ఉండటం లేదని విమర్శించారు.
శాంతియుత నిరసనకూ చోటు లేదా?: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా బీసీలకు లేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసేంత వరకే బీసీలు గుర్తుకు వస్తారని, వాటాలు చెల్లించాల్సి వస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తారని ఆరోపించారు. కేవలం మాటలకే పరిమితమైన ప్రభుత్వం బీసీలను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకల్ బాడీల్లో కూడా బీసీలకే అత్యధిక స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బరిగీసి కొట్లాడే తెలంగాణ సమాజం ఎందుకు నిర్వీర్యమవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీల ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు మహాత్మా జ్యోతిబా పూలే సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం కేటాయింపులు మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ప్రొఫెసర్ మురళీమనోహర్, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, యెలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్, వైస్ చైర్మన్ దర్గయ్యగౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నాయకులు వెంకన్న, బైరు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.