వికారాబాద్, ఏప్రిల్ 19 : గత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద్ధ్దులూర్, పాతూర్, కొటాలగూడ తదితర గ్రామాల్లో మామిడికాయలు నేల రాలగా.. కూరగాయల పంటలూ పాడైపోయాయి. మండలంలో సుమారు 70 ఎకరాల్లో మామిడి, 20 ఎకరాల్లో కూరగాయల పంటలు పాడు కాగా.. 30 మంది రైతులకు రూ.40లక్షల వరకు నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పంటలు సాగు చేయగా.. ఈదురుగాలులు తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వ్యవసాయ, ఉద్యాన వనశాఖల అధికారులు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు. 33 శాతం కంటే ఎక్కువ పాడైన మామిడి తోటలు 40 ఎకరాలు కాగా.. 10 మంది రైతులకు నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా 10 ఎకరాల్లో కూరగాయలను సాగు చేసిన ఏడుగురు రైతులకు 33 శాతం కంటే ఎక్కువగా నష్టం వాటిల్లిందని.. మొత్తం పంట నష్టం రూ.36 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకుని కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని వారు చెప్పారు.