ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 8 : గతంలో సింగిల్ రోడ్డు. ఎదురుగా వాహనం వస్తే ఇంకో వాహనం రోడ్డు దిగాల్సిందే. గతుకులు, మలుపులతో నిత్యం ప్రమాదాలు జరిగేవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్లాది రూపాయలు మంజూరు చేసి నిర్మించడంతో రోడ్లు ధగధగా మెరుస్తున్నాయి. రాకపోకలు అలసట లేకుండా సాఫీగా సాగేలా రోడ్డు పనులు పూర్తి కావచ్చాయి. ఇబ్రహీంపట్నం నుంచి అనాజ్‌పూర్ వరకు రూ.62కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉమ్మడి పాలకుల హయాంలో రోడ్డును వెడల్పు చేస్తామని హామీలిచ్చినా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లను నాలుగులైన్ల రహదారులుగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నుంచి ఆక్టోపస్, ఎన్ఎస్జీ రక్షణ రంగ సంస్థలను కలుపుతూ నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాల మీదుగా అనాజ్‌పూర్ వరకు రూ.62 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు 80 శాతం పూర్తి కావడంతో నాగన్‌పల్లి, పోల్కంపల్లి, మన్నెగూడ, నెర్రపల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్న ఆదిబట్ల, కొంగరకలాన్, ఎలిమినేడు తదితర గ్రామాలకు ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేస్తూ అనేక రోడ్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎలిమినేడు వరకు, ఎలిమినేడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు వేస్తున్న అతి పెద్ద రోడ్డు పూర్తి కావచ్చింది. ఈ రోడ్డు పూర్తయితే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎలిమినేడు వరకు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎలిమినేడు, మంగల్‌పల్లి, పోచారం, తదితర ప్రాంతాల్లో ఇరుగ్గా ఉన్న వంతెలను కూడా వెడల్పు చేయడంతోపాటు అతి పెద్ద వంతెల నిర్మాణం చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారికి చేరుకోడానికి ప్రయాణికులు రాయపోల్, దండుమైలారం మీదుగా తూప్రాన్‌పేట్ వద్ద చేరుకోవచ్చు. నాగన్‌పల్లి, పోల్కంపల్లి మీదుగా కొనసాగుతున్న రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ప్రయాణం సులభతరంగా మారనుందని ప్రయాణికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– చెరుకూరి రవీందర్, పోల్కంపల్లి
గతంలో భూముల ధరలు తక్కువగా ఉండేవి. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల భూముల ధరలు కోట్లాది రూపాయలకు చేరుకున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వరకు భూముల ధరలు విపరీతంగా పెరుగడంతో ఈ ప్రాంతంలోని రైతులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పిన ఆంధ్ర పాలకులకు ఇది చెంపపెట్టులాంటిది.
గతంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ, సీఎం కేసీఆర్ చల్లని దీవెనతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఎలిమినేడులో పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతంలో రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రోడ్ల పనులతో భూముల ధరలు రూ.కోట్లలో పలకడంతో ఈ ప్రాంతంలోని రైతులు కోటీశ్వరులుగా మారిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.