పరిగి, డిసెంబర్ 4 : గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలో ఒక్కో ఉద్యోగి నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాల్సిందిగా విధులు కేటాయించిన జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన అంగన్వాడీ టీచర్‌కు ఓపీవో (అదర్ పోలింగ్ ఆఫీసర్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులకూ ఎన్నికల విధుల ఆర్డర్లు ఇవ్వడం విడ్డూ రంగా ఉన్నది. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఆయా శాఖల్లో గ్రామాలు, మండలాలవారీగా ఏ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నారనేది పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి విధులు కేటాయించాలి. కానీ, వికారాబాద్ జిల్లా స్థాయి అధికారుల అనాలోచిత వైఖరి, అతి విశ్వాసం తో అనేక తప్పిదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
పరిగి మండలంలోని రాపోల్ గ్రామంలోని అంగన్వాడీ-2 కేంద్రం టీచర్ భాగ్యరేఖ(ఎంప్లాయీ కోడ్ 115080025) 2020లోనే ఆమె మృతి చెందినా పంచాయతీ ఎన్నికల్లో ఓపీవోగా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు పరిగిలోని ఎంపీపీఎస్ పరిగి(బాలికలు) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కనకాచారితోపాటు మరికొందరికీ ఎన్నికల విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉన్నతాధికారుల అనాలోచిత చర్యలపై సర్వత్రా విమర్శలున్నాయి.