రంగారెడ్డి, మార్చి 10(నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత నిరుపేద యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రుణాలతోపాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అయితే ఎస్‌హెచ్‌జీ సభ్యులతోపాటు గ్రామీణ ప్రాంతానికి చెందిన యువత స్వయంగా ఉపాధి పొందేందుకుగాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ-ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం చిలుకూరులోని మహిళా ప్రాంగణంలో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. 2005 నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీయువకులకు ప్రత్యేక శిక్షణనిచ్చి ఉపాధి చూపుతున్నారు. జిల్లాలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో పలు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో ఎంతో మంది యువత జీవనోపాధి పొందడంతోపాటు వారు మరింత మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది.
చిలుకూరులోని స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 63 రకాల వృత్తి నైపుణ్య కోర్సుల్లో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. అయితే కోర్సులను బట్టి 6 రోజుల నుంచి 45 రోజుల వరకు శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా 19 రకాల వృత్తి నైపుణ్య కోర్సులకు డిమాండ్ ఉండటంతో ఆయా కోర్సుల్లోనే యువతీయువకులు శిక్షణ తీసుకుంటున్నారు. వృత్తి నైపుణ్య కోర్సులకు సంబంధించి… యోగా, వ్యక్తిత్వ వికాసం, జర్దోషి మగ్గం వర్క్, సెల్‌ఫోన్ సర్వీసింగ్, రిపేరింగ్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, సీసీ టీవీ, ద్విచక్ర వాహనాల మెకానిక్, కారు డ్రైవింగ్, జ్యూట్ బ్యాగుల తయారీ, ఆర్టిఫీషియల్ జ్యూవెల్లరీ, కొవ్వొత్తుల తయారీ, అగర్బత్తీల తయారీ, పుట్ట గొడుగుల పెంపకం, డైరీ, వర్మీకంపోస్ట్ తయారీ, పాపడాలు, అప్పడాలు, చట్నీల తయారీ, రిఫ్రిజిరేటర్-ఏసీ మెకానిక్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్-బేసిక్ నెట్వర్కింగ్, కంప్యూటర్ డీటీపీ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అధిక మంది ఆసక్తి చూపుతున్నట్లు
సంబంధిత అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 600 మందికి స్వయం ఉపాధి శిక్షణ అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. సంవత్సరానికి 24 బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది యువతీ యువకులకు ఈ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7,498 మంది యువతీయువకులకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 5,319 మంది వారు తీసుకున్న వృత్తి నైపుణ్యాల్లో స్థిరపడ్డారు. అదేవిధంగా 695 మంది యువతీయువకులు వారు శిక్షణ పొందిన కోర్సుల్లో నెలవారీ వేతనం తీసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. మరోవైపు స్వయం ఉపాధి పొందిన అనంతరం యువకులు ఏర్పాటు చేసుకునే వ్యాపారానికి గాను డీఆర్డీఏ-ఎస్బీఐ ఆధ్వర్యంలో రుణాలను కూడా మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందిన వారిలో 2,422 మందికి రుణాలను మంజూరు చేశారు. ఈ శిక్షణకు ఏడాదికి రూ.35-40 లక్షల మేర ప్రభుత్వం వెచ్చిస్తుండగా, ఒక్కొక్కరికీ రూ.24 వేల వరకు ఖర్చు చేస్తుంది. స్వయం ఉపాధిలో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారికి ఉచిత శిక్షణ కార్యక్రమంతోపాటు వసతి, భోజనం శిక్షణ పూర్తయ్యే వరకు ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తున్నది.
స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో టైలరింగ్‌లో ఇప్పటివరకు 15 బ్యాచ్‌లకు నేర్పించా. నేర్పించే విధానాన్ని బట్టి నెల రోజుల్లోనే టైలరింగ్ పూర్తిగా నేర్చుకుంటున్నారు. ఎంతో మంది శిక్షణ అనంతరం టైలరింగ్ షాప్‌లు పెట్టుకొని స్థిరపడుతున్నారు. నెల రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకొని, ఉపాధి పొందుతుండటం నాకు చాలా సంతోషంగా ఉన్నది.
– రాణి, ట్రైనర్
నేను నర్సింగ్ చదువుతున్నా. ఉచితంగా స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని టైలరింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఉచిత వసతి, భోజనంతోపాటు పర్యవేక్షణ బాగుంది. టైలరింగ్ బయట నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అంత డబ్బు చెల్లించలేక ప్రభుత్వం అందిస్తున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణలో చేరాను. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– సరిత, పరిగి, వికారాబాద్ జిల్లా
టైలరింగ్ శిక్షణతో నా కాళ్లపై నేను నిలబడతాననే ధైర్యం నాకు వచ్చింది. చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను నేర్చుకోవడమే కాదు.. నలుగురికి నేర్పించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రక్షణ కూడా బాగుంది.
– మాధవి, కనకమామిడి, మొయినాబాద్