యాచారం, సెప్టెంబర్ 27: కూలిపనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. గమ్యస్థానం చేరకుండానే ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులు అనంతలోకాలకు వెళ్లారు. ఆగిఉన్న డీసీఎంను ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఎన్టీఆర్తండా సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
ఈ ప్రమాదంలో కుర్మిద్ద గ్రామానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు అదే గ్రామానికి చెందిన పది మందికి తీవ్ర గాయాలయ్యారు. మృతులు, క్షతగాత్రులు అందరూ సమీప బంధువులు కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం.. కుర్మిద్ద గ్రామానికి చెందిన సురిగి శ్రీనివాస్ (35), సత్తమ్మ(49), శ్రీధర్(25) మహేశ్వరం మండలం రావిరాల వద్ద ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో హౌస్ కీపర్లుగా పనిచేస్తున్నారు.
రోజూ మాదిరిగానే పని ముగించుకొని అదే గ్రామానికి చెందిన సురిగి శ్రీనివాస్ ఆటోలో తిరిగి కుర్మిద్ద గ్రామానికి వస్తున్నారు. శ్రీధర్, సత్తమ్మలతో పాటు మరికొంత మంది హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ రోడ్డు మీదుగా వస్తుండగా, కందుకూరు మండల పరిధిలోని ఎన్టీఆర్తండా దాటిన తరువాత బ్రిడ్జిమీద రోడ్డుపై ఆగివున్న డీసీఎంను ఆటో నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్‌కు డీసీఎం కనిపించకపోవడంతో ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు సత్తమ్మ, శ్రీధర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
రోడ్డు ప్రమాదంలో లింగమ్మ, జంగమ్మ, స్వరూప, శాంతమ్మ, హంసమ్మ, అరుణ, మంజులకు తీవ్రగాయాలు కాగా, గోపలి మరియమ్మ, రేణుక, లావణ్యలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.