వికారాబాద్, అక్టోబర్ 3, (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా వ్యూహంతో పనిచేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చే విధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు మండలాల్లో సమావేశాలను నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అంతటా మండలాల వారీగా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపొందేందుకు సమాయత్తం చేయనున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆయా మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా బరిలో దింపే వారిలో స్థానికంగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతోపాటు బలమైన అభ్యర్థినే బరిలోకి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తున్నది. అయితే జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులనే పోటీలో దింపేందుకుగాను అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తుండడంతో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే బరిలోకి దింపేలా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీ నుండి పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకుల నుండి విముఖత చూపుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల స్థానాలు పెరిగాయి, గత ఎన్నికల్లో 18 జడ్పీటీసీ, 18 ఎంపీపీ, 221 ఎంపీటీసీ స్థానాలు 565 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఈ దఫా 20 జడ్పీటీసీ స్థానాలకు, 20 ఎంపీపీ స్థానాలకు, 227 ఎంపీటీసీ స్థానాలు, 594 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 137 ఎంపీటీసీ స్థానాలను, 16 జడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలతోపాటు 355 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత రెండేళ్లలో జిల్లా ఆగమాగమైంది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకూ అన్యాయం చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను మోసం చేసింది. ప్రధానంగా రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నయా పైసా మంజూరు చేయకపోవడంతోపాటు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రేణులను బీఆర్ఎస్ నాయకత్వం సమయాత్తం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛతలో, అభివృద్ధిలో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్థంగా మారి, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.
కనీసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయకపోవడంతో మూలన పడిన పరిస్థితికి తీసుకువచ్చారు. అదేవిధంగా అర్హులకు ఇంకా పూర్తికాని రుణమాఫీ, మూడు సీజన్లు పూర్తైన కేవలం ఒక్క సీజన్లోనే అందరికీ పెట్టుబడి సాయం అందించి, రెండు సీజన్లలో పెట్టుబడి సాయం అందజేయకుండా రైతులను అప్పుల పాలు చేయడం, పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని హామీనిచ్చి విస్మరించడం, ఆసరా పింఛన్ల పెంపు చేపట్టకపోవడం, మహిళలకు ఆర్థిక సాయం, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, అర్హులకు అన్యాయం చేయడం తదితర సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లా బీఆర్ఎస్ యంత్రాంగం శ్రేణులను సమయాత్తం చేస్తున్నది. అదేవిధంగా మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి దిశానిర్దేశంలో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై, రైతు సమస్యలపై, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాకపోవడం, ఆసరా పింఛన్ల పెంపు చేపట్టకపోవడం తదితర అంశాలపై వీరందరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్‌కు గుబులు…
స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం కావడంతో క్షేత్రస్థాయిలో సబ్బండ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సకాలంలో యూరియా సరఫరా చేయకుండా రైతులను రోజుల తరబడి కష్టాల పాలు చేయడం, పూర్తికాని రుణమాఫీ, మూడు సీజన్లు పూర్తైన కేవలం ఒక్క సీజన్లోనే అందరికీ పెట్టుబడి సాయం అందించి, రెండు సీజన్లలో పెట్టుబడి సాయం అందజేయకుండా రైతులను అప్పుల పాలు చేయడం, పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని హామీనిచ్చి విస్మరించడం, ఆసరా పింఛన్ల పెంపు చేపట్టకపోవడం, మహిళలకు ఆర్థిక సాయం, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, అర్హులకు అన్యాయం చేయడం వంటి కారణాలతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వడం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంలో భాగమేనని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుండి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికలు జరగవనే ప్రచారం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా సబ్బండ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు వెనుకడుగు వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా నేడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కొడంగల్, తాండూర్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డిలు వికారాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జడ్పీ చైర్మెన్‌తోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు తీవ్ర పోటీ ఉండడంతో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సమావేశమంలో చర్చించనున్నారు. అయితే జడ్పీ చైర్మెన్ అభ్యర్థికి సంబంధించి రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో ఆశావాహుల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సమాలోచనలు చేయనున్నారు. అంతేకాకుండా జడ్పీ చైర్మెన్ అభ్యర్థి ఎవరనేది నేటి మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.