స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో పాలన పూర్తిగా పడకేసింది. ఇబ్బందులు కలిగితే చెప్పుకోవడానికి ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి సమస్యను తామే పరిష్కరించాల్సి రావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శులకు మోయలేని భారంగా పరిణమించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 595 గ్రామపంచాయతీలు, 20 మండల పరిషత్‌లు, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. గ్రామపంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ముగిసి ఏడాది దాటగా.. మండల పరిషత్‌ల పాలకవర్గాలు ముగిసి 8 నెలలు, మున్సిపాలిటీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి రెండు నెలలు దాటింది.
ఇలా స్థానిక సంస్థలన్నింటికీ కాల పరిమితి ముగిసి నెలలు దాటినా సర్కారు వాటికి ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం చేయడంతో రోజుకొక సమస్య తలెత్తుతున్నది. మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వ్యవహరిస్తుండగా, మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీలకు వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. కొందరు అధికారులకు రెండుమూడు గ్రామపంచాయతీల బాధ్యతలు సైతం ఉన్నాయి.
– పరిగి, ఏప్రిల్ 24
స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించగా వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా కొనసాగుతుండగా.. ఎపుడో ఒకసారి వచ్చి వెళ్లడం తప్ప ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నదిలేదు. మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి అధికారులు ఇందుకేమీ తీసిపోనివిధంగా వ్యవహరిస్తున్నారు. వీరు నెలకు కనీసం ఒకసారి సైతం మండలాల వైపు చూడడంలేదు.
గ్రామపంచాయతీలకు సంబంధించి మండలస్థాయి అధికారులు పలువురు ఇప్పటివరకూ గ్రామాలకు వెళ్లనివారు ఉండడం గమనార్హం. తద్వారా ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారి ఎవరనేది ప్రజలకు సైతం తెలియని ఉదంతాలున్నాయి. బాధ్యతలు సైతం ఆయా మండల కార్యాలయాల్లోనే తీసుకొని, ఇప్పటివరకు గ్రామాల ముఖం చూడనివారూ ఉన్నారు. ఏదైనా ఫైల్‌పై ప్రత్యేకాధికారి సంతకం కావాలంటే వారి కార్యాలయానికి వెళ్లి పెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సదరు ప్రత్యేకాధికారులకు ఆయా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ఏ సమస్యలు ఉన్నాయనేది సైతం తెలియడంలేదు. అంతా స్థానిక అధికారులే చూసుకుంటారనేలా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తున్నది.
Rr7
సతమతమవుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శులు
ప్రత్యేకాధికారుల పాలనలో బాగా సతమతమవుతున్నది గ్రామపంచాయతీ కార్యదర్శులని చెప్పవచ్చు. ఏదైనా సమస్య ఉన్నదని అధికారులకు చెబితే పంచాయతీ కార్యదర్శిని చేయించమని హుకూం జారీ చేస్తున్నారు. ఇటీవలి వరకు గ్రామపంచాయతీ సిబ్బందికి సైతం వేతనాలు రానపుడు ప్రతినెలా పంచాయతీ కార్యదర్శులు తమ సొంత డబ్బులు ఎంతో కొంత సిబ్బందికి ఇచ్చిన ఉదంతాలున్నాయి.
లేదంటే సిబ్బంది పనిచేయడానికి సక్రమంగా రావడం లేదని, అందువల్ల వారి అవసరాలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. గత సంవత్సరం వేసవి కంటే ముందుగానే గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి సంబంధించి కాలిపోయిన బోరు మోటార్లు బాగు చేయించడం, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతు పనులు స్వయంగా పంచాయతీ కార్యదర్శులు చేయించారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి డబ్బులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు చేయించి, ఎంబీ రికార్డులు పూర్తయినా ఏడాదికాలంగా తమకు డబ్బులు రాలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామపంచాయతీలో రూ.50వేలకు పైగానే ఖర్చు చేసినా నేటికీ డబ్బులు రాలేదన్నారు.
నిర్వహణకు నిధులు లేక..
ఈసారి వేసవిలో నీటి సమస్యలు ఎక్కడ నెలకొన్నా వెంటనే బాగు చేయించండని అధికారులు పేర్కొంటున్నారని, ఇప్పటికే తాము ఖర్చు చేసిన డబ్బులు రాకపోగా మరోసారి ఖర్చు చేయమనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ప్రతినెలా చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోసేందుకు ఉపయోగించడానికి ట్రాక్టర్‌కు డీజిల్, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, గ్రామపంచాయతీల్లో నిధులు లేక సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నదన్నారు. పాలకవర్గాలు లేక కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దీంతో ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులను ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎంపిక చేస్తుండగా జాబితా తయారు తర్వాత మండలస్థాయి అధికారులు సదరు జాబితాపై పంచాయతీ కార్యదర్శులతో సంతకాలు చేయిస్తున్నారు. తమకు సంబంధం లేని అంశంలో అధికారులు సంతకాలు చేయిస్తుండగా, ఇల్లు మంజూరు కానివారు తమ దగ్గరకు వచ్చి ఇల్లు తనకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రతి చిన్న విషయానికి పంచాయతీ కార్యదర్శులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. పని చేస్తావా లేదంటే బదిలీ చేయించాలా అంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ విధుల నిర్వహణ కత్తిపై సాములా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.