రంగారెడ్డి/వికారాబాద్ మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రంగారెడ్డి జిల్లాలో 185, వికారాబాద్ జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో 80,490., సెకండ్ ఇయర్లో 78,395., వికారాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో 7914., సెకండ్ ఇయర్లో 6963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్లను నియమించారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సంబంధీకులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతోపాటు మౌలిక వసతులు కల్పించారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోనున్నారు.
పరీక్షల నిర్వహణలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులకు ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు చేశారు. విద్యార్థులు ఉదయం 8.45 లోపు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. 9.05 నిమిషాల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించే అవకాశం బోర్డు కల్పించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.