పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన జాబితా ప్రకారమే పంచాయతీల పరిధుల్లో వార్డుల వారీగా లిస్ట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లోని 8,19,914 మంది ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికే షన్ విడుదల కాగా.. దానిపై పలు దఫాలుగా రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ సైతం పూ ర్తైంది. ఈనెల 28న తుది జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. అయితే జిల్లాలోని పలు మండలాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం తో పంచాయతీ ఎన్నికల్లోనూ వారే నిర్ణేతలు కానున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై ఎన్నికల అధికారులు కసరత్తు చేసి తుది రూపునకు తీసుకొచ్చారు. వార్డుల వారీగా రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 12న అన్ని గ్రామపంచాయతీల్లోని నోటీస్ బోర్డుల్లో పెట్టారు. మండల పరిషత్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు మరో వార్డులో ఉండడం, ఓటర్ల పేర్ల విషయంలోనూ తప్పులు దొర్లాయి. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్ల విషయంలోనూ చాలాచోట్ల అభ్యంతరాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరిం చారు. ఇందుకుగాను ఆయా పంచాయతీల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాక తుది జాబితాను ఈనెల 28న విడుదల చేయనున్నారు.
అధికారులు ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే..చాలా చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్, ఫరూఖ్‌నగర్, ఇబ్రహీంపట్నం, కేశంపేట, కొందుర్గు, నందిగామ, శంషాబాద్, శంకర్పల్లి, యాచారం మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నా రు. దీంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను వారే నిర్ణయించే అవకాశం ఉన్నది.