అన్నదాత అడుగడుగునా అన్యాయమైపోతున్నాడు. విత్తనాల కొనుగోలు మొదలు.. పంట చేతికొచ్చేదాకా.. ఆ పంటను మార్కెట్లో అమ్ముకునే వరకూ నిలువు దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంటను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురాగా అక్కడ కూడా మిర్చి పంట చోరీకి గురవుతోంది. కిందపడిన మిర్చిని ఏరివేత ముసుగులో మహిళా కూలీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చూసేందుకు చిన్నదే ఇది కావచ్చు గానీ.. ఇలా నిత్యం క్వింటాళ్లకొద్దీ రైతన్నల మిర్చి పంట దొడ్డిదారి పడుతోందంటే అతిశయోక్తి కాదు.
– రఘునాథపాలెం, మార్చి 10
రైతులు పంటను అమ్ముకునే సమయంలో మిర్చి నాణ్యతను పరిశీలించేందుకు వ్యాపారులు ఒకటి రెండు బస్తాలను బ్లేడ్‌తో కోయిస్తారు. దీనిని అవకాశంగా తీసుకుంటున్న మహిళా కూలీలు బస్తాల్లో నుంచి మరీ దొంగతనంగా మిర్చిని తీసుకొని కిలోలకొద్దీ బస్తాల్లో వేసుకుంటున్నారు. ఖమ్మం మార్కెట్లో వందల సంఖ్యలో ఉన్న మహిళా కూలీలు ముఠాలుగా ఏర్పడి రైతులకు సేవ పేరుతో పెద్దఎత్తున పంటల దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో నిత్యం ఇదే పనిగా పెట్టుకొని బస్తాల్లోని మిర్చిని దొంగతనంగా చీరె కొంగున నింపుకోవడం.. ఆ పిమ్మట బస్తాల్లో తీసుకెళ్లి మార్కెట్ గోడ పైనుంచి బయటకు తరలించి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడం చేస్తున్నారు.
ఇలా నిత్యం సుమారు పది క్వింటాళ్లకు పైగా మిర్చి దొడ్డిదారిన తరలుతోందంటే ఆశ్చర్యపోకతప్పదు. రైతులు, వ్యాపారుల సూచన మేరకు ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ఖమ్మంలోని మిర్చి మార్కెట్లో పరిశీలన చేపట్టగా.. సుమారు గంట వ్యవధిలోనే వందకు పైగా బస్తాల్లో కొద్దికొద్దిగా మిర్చిని మహిళా కూలీలు దొంగిలించి మార్కెట్ గోడ మీదుగా బయటికి అందజేయడం కనిపించింది. వీరి దోపిడీకి మార్కెట్లోని పలువురు దడవాయిలు సైతం సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై మార్కెట్ అధికారులు దృష్టి సారించి మహిళా కూలీల చాటుమాటు వ్యవహారానికి చెక్ పెట్టాలని రైతులు, వ్యాపారులు వేడుకుంటున్నారు.