సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కేవలం బుల్డోజర్లతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కారును చూసి తెలంగాణ ప్రజలతోపాటు, ఖండాంతరాల్లో ఉన్న ప్రవాసీయులూ సైతం భయపడుతున్నారు. ఎక్కడో స్థిరపడినవారు కూడా… ఇక్కడ ఇండ్ల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కూల్చాల్సి ఉండగా.. అడ్డగోలుగా జనాల ఇండ్లపైకి బుల్డోజర్లు దూసుకెళ్లడంతో బిక్కుబిక్కుమనే పరిస్థితికి చేరుకుంటున్నారు. నగరంలో హైడ్రా పేరిట రేవంత్ సర్కారు సృష్టిస్తున్న విధ్వంసం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదనీ, నిబంధనలు అతిక్రమించి, కోర్టు ఆదేశాలను ధిక్కరించి చేస్తున్న విధ్వంసంతో నగరంలో స్థిరాస్తులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలోని గుండ్లపోచంపల్లి పరిధిలో మంగళవారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల అలజడి అమెరికాకు చేరింది. కన్నవారికి దూరంగా ఉంటూ బతుకులు సాగిస్తున్న ఎంతో మందిని కలవరపెట్టేలా సర్కారు చేసిన కూల్చివేతలు ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆలిండియా ఓవర్సీస్ మహిళ కాంగ్రెస్ నేత జ్యోతిరెడ్డి ఇంటిని కూల్చివేయడంతో వివాదం కాస్తా ఖండాతరాలు దాటింది. దీనిపై జ్యోతి రెడ్డి స్పందిస్తూ… రేవంతన్నయ్యా… “మీరు చేపడుతున్న కూల్చివేతలు విదేశాల్లో ఉన్న మాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇన్నాళ్లు మీరు చేస్తున్నది అభివృద్ధి అనుకున్నాం. కానీ అడ్డగోలుగా సాగుతున్న ప్రభుత్వ చర్యలతో ఆందోళన కలిగిస్తుంది. అన్ని అనుమతులు ఉన్న ఇంటిని కూడా కూల్చివేస్తున్నారంటే… ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందనే విషయాన్ని గమనించాలి. కనీసం ఇంట్లో వృద్ధులు ఉన్నారనే సోయి లేకుండా, కూల్చివేసి ఎవరినీ భయపెట్టాలని చూస్తున్నారు. దయచేసి మీ కూల్చివేతలతో ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం కంటే… ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది.” అంటూ ఓ వీడియో విడుదల చేసింది. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది.