వికారాబాద్, జనవరి 3 : ప్రభుత్వం చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి, సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా వంద పని దినాల్లో నిర్దేశిత తేదీల్లో శిబిరాలు నిర్వహించాలన్నారు.
సాధారణ వైద్య సేవలకు అంతరాయం లేకుండా 927 మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో 42 బృందాలను ఏర్పాటు చేసి 566 జీపీలు, 97 మున్సిపాలిటీల్లో 100 రోజుల పాటు పని దినాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో కలెక్టర్, నిఖిల, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, యాదయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
కేసీఆర్ గొప్ప ఆలోచనతో కంటికి వెలుగు
రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనతో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. అది ప్రజలకు ఒక వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి మంత్రి హరీశ్‌రావు మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ‘కంటి వెలుగు’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్‌గుప్తా, కలెక్టర్ అమయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమం కోసం రంగారెడ్డి జిల్లాలో 80 టీములను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా మరో ఐదు టీములను కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు చెప్పారు. ఈ నెల 12లోపు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేస్తామన్నారు. జిల్లాకు ఇప్పటికే 83,645 రీడింగ్ గ్లాసులు జిల్లాకు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.