వికారాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్రమం గా తరలిస్తున్నది. ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లలో కాగ్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ రెచ్చిపోతున్నది. తాండూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాను యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లో ఏదో ఒక చోట ప్రజలు అడ్డుకుంటు న్నా…అధికార పార్టీ నాయకుల అండతో ఇసుక మాఫియా అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల తాండూరు మండలంలోని చంద్రవంచ గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినా మా ఊ రు మీదుగా ఇసుక వాహనాలను అనుమతించమని రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేయగా, రెవెన్యూ అధికారులు వచ్చి స్థానికులను సముదాయించారు. అలాగే, బషీరాబాద్ మండలంలో ఏకంగా పోలీసులపైనే దాడి చేసిన పరిస్థితులున్నాయి. ఇటీవల బషీరాబాద్ మండలంలోని కొరివిచెడ్ పరిధిలో పెట్రోలింగ్ వాహనానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు అడ్డుపడడంతో పోలీసులు వెంబడించడంతో ఇసుక మాఫియా పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పరారైంది.
అంతేకాకుండా బషీరాబాద్ మండలంలోని జమ్లానాయక్తండా సరిహద్దులో ఇసుక మాఫియా అక్రమ రవాణా సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అడ్డుకునేందుకు వెళ్లగా, పోలీసులను చూసిన ఇసుక మాఫియా ట్రాక్టర్ను పోలీసులపైకి ఎక్కించే ప్రయత్నం చేయగా ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా బషీరాబాద్ మండలంలోని కంసాన్పల్లి(బి) పరిధిలో రైతుల పొలంలో ఇసుక మేటను ఇసుక మాఫియా అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. మా పొలంలోని ఇసుక మేటను మీరెలా తీసుకెళ్లారంటూ ఇసుక మాఫియాతో వాగ్వాదం జరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అయితే ఇసుక మాఫియా ఫిర్యాదుతో కేసు చేసిన పోలీసులు, రైతులు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై స్థానికంగా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాండూరు నియోజకవర్గంలో బరితెగించి వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నాయకులుండడంతో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జోరుగా ఇసుక దందా..
తాండూరు నియోజకవర్గంలోని యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. జిల్లాలో ఇసుక మాఫియా రాత్రి సమయాల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో హోరెత్తిస్తున్నది. యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని కాగ్నానది పరీవాహక ప్రాంతా ల్లో అధిక మొత్తంలో ఇసుక వనరులు ఉన్నాయి. సంబంధిత ప్రాంతాల నుంచి ప్రతి ఏటా రూ.కోట్ల విలువైన ఇసుక లభ్యమవుతున్నది. కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో ఫిల్టర్ ఇసుక అక్రమ వ్యాపారమూ జోరుగు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు నెలనెలా మామూళ్లు తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారనే ఆరోపణలున్నాయి.
యాలాల మండలంలోని కాగ్నా పరీవాహక ప్రాంత పరిధిలోని విశ్వనాధ్పూర్, అగ్గనూర్, సంగెంకుర్దు, గోవిందాపూర్, దేవనూర్, తాండూరు మండలంలోని గోనూర్, వీరశెట్టిపల్లి, పాత తాండూర్, చంద్రవంచ, ఖంజాపూర్ గ్రామాల పరిధి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేర ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ్లలో యధేచ్చగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయితే డబ్బులకు కక్కుర్తి పడి సంబంధిత అధికారులు ఇసుక మాఫియాకు అండగా ఉంటూ ఇసుకను తరలించడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తున్నట్లు చూట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.