మంచాల, సెప్టెంబర్ 13 : రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, ఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి, నకిలీ విత్తనాల మోసాలు.. తదితర విషయాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. వానకాలం సీజన్లో పంటలను ఎలా కాపాడుకోవాలి… ఇంకా సాగు చేయాలనుకునే వారు ఎలాంటి పంటలు వేయాలి, ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలో సూచిస్తున్నారు.
రైతన్నలు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న అంశాలపై అధికారులు రైతులను ఎప్పడికప్పుడు చైతన్య పరుస్తున్నారు. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్‌కు ఒకటి చొప్పున మంచాల మండలంలోని ఆరుట్ల, బోడకొండ, మంచాల గ్రామంలో రైతు వేదికలు నిర్మించగా, ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. క్లస్టర్ పరిధిలోని రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ వివరాలు, రైతుబంధు, రైతుబీమా ఇతర పథకాలతో ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో రైతు వేదికల్లో ఏఈవోలు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో సందడి నెలకొంటున్నది.
రైతు వేదికల్లో పంటల సాగుపై అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మంచాల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో పంటల సాగుపై రైతులను చైతన్య పరుస్తున్నారు. పచ్చిరొట్ట ఆవశ్యకత, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఆధార్ అనుసంధానం, రైతుబీమా, రైతుబంధు, పత్తి, కంది ఇతర విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, బ్యాక్టీరియా ఉపయోగం, లాభాలు, ఎరువుల సమతుల్య వాడకం తదితర అంశాలను వివరిస్తున్నారు. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లాస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు, పురుగుల మందులను కొనుగోలు చేయాలని అవగాహన పెంచుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను అన్నదాతలు పాటించాలి. మంచాల క్లస్టర్ పరిధిలో అధికారులు అందుబాటులో ఉంటారు. పంటల సాగుపై ఎలాంటి సలహాలు కావాలన్నా, సందేహాలున్నా అధికారులను సంప్రదించవచ్చు. గతంలో శిక్షణ తరగతులను నిర్వహించుకునేందుకు సదుపాయాలు ఉండేవి కాదు. ఇప్పుడు రైతు వేదికలు ఉపయోగ పడుతున్నాయి.
– జ్యోతిశ్రీ, ఏఈవో