వికారాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడుగడుగునా అడ్డకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో నిధులివ్వకపోగా ప్రాజెక్టు డీపీఆర్‌నే పూర్తిగా మార్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగునీరు రాకుండా అడ్డుకునేందుకు పావులు కదుపుతుండటం గమనార్హం.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదట సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు నీరందించేలా 90.81 టీఎంసీల సామర్థ్యంతో కూడిన డీపీఆర్‌తో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారు. అనంతరం పాలమూరు ఎత్తిపోతల పనులకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేయడంతో ఒక పంపు హౌస్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒక్క బడ్జెట్లోనూ ప్రస్తావించకుండా, పేరు నిధులు కేటాయిస్తున్నామని పేపర్‌పై చూపిస్తూ నయా పైసా మంజూరు చేయలేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపి జల దోపిడీకి కుట్రలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదు. 90.81 టీఎంసీల సామర్థ్యంతో కూడిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంతోపాటు 45 టీఎంసీలకు కుదించి ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మాత్రం విషయం బయటకు రానివ్వకుండా మోసం చేసింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గ్రామగ్రామానా ప్రజా ఉద్యమాలు చేయడంతోపాటు ప్రజాక్షేత్రంలో పాలమూరు ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయంపై ఎండగట్టేందుకు త్వరలో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు నిర్ణయించారు. గ్రామగ్రామానా డప్పు చాటింపు చేసి, కవులు, కళాకారులను తట్టి లేపి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, జల దోపిడీని అడ్డుకునేందుకు కొట్లాడుతామని బీఆర్ఎస్ అధినేత సమరశంఖం పూరించారు.
కాంగ్రెస్ సర్కారు రెండేళ్లుగా వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాకు సాగునీరందడం కలగానే మిగిలిపోనుందనే వాదన వినిపిస్తున్నది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని సగానికిపైగా తగ్గించి మళ్లీ ఆంధ్ర ప్రాంతానికి సాగునీటిని తరలించే కుట్రకు కాంగ్రెస్ చేతులు కలుపుతుండటం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగు నీరొచ్చే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 2015లోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, ఏపీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేయడంతో పనులు నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

90 శాతం పూర్తైన పనులు
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు కూడా అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీడులు వారిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరందించి ప్రజల ఏండ్ల కలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి రూ.27 వేల కోట్లను ఖర్చు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాగా, కేవలం సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణ పనులు మాత్రమే చేయాల్సి ఉంది. కాల్వల నిర్మాణ పనులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ సర్కారు నిధులను కూడా విడుదల చేసింది. ఏడాదిలో సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాశే మిగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు 2 వేల వరకు హబిటేషన్లకు తాగునీరందించేలా ప్లాన్ రూపొందించారు. గత ప్రభుత్వం కాలువల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువుల వరకు నీటిని నింపేందుకు కూడా ప్రణాళికను రూపొందించింది.
రెండేళ్లుగా నయాపైసా నిధులివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదిలో జిల్లాకు సాగు నీరొస్తుందనుకున్న తరుణంలో బీఆర్ఎస్ సర్కారు మారడంతో జిల్లా రైతాంగం ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. దాదాపు పూర్తి కావొచ్చిన జిల్లా వరప్రదాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్లలో రూపాయి ఖర్చు చేయకపోవడం గమానర్హం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసులు వేసి మొదటి నుంయి అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కూడా తీరు మారడంలేదు.
జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి కేవలం కొడంగల్ వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారు తప్పా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగునీరందించడంపై రెండేళ్లలో ఎలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయం.
పాలమూరు ఎత్తిపోతల పథకంపై మీడియాతో కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.37 వేల కోట్ల నిధులను మంజూరు చేశామని, వీటిలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేశామని, 88-90 శాతం పనులు పూర్తి చేశాం. బీహెచ్ఈఎల్ తయారు చేసిన 145 మెగావాట్ల పంపులను ఏర్పాటు చేశాం. 90.81 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించాం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండేళ్లలో రూపాయీ ఖర్చు చేయలేదు, తట్టెడు మట్టి తీసిపోయలేదు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపితే కాంగ్రెస్ సర్కారు దాచిపెట్టింది. 90 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టును 45 టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టును ఆగం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా కూడా కృష్ణా బేసిన్లోనే ఉంది, రంగారెడ్డి జిల్లాలో పడే ప్రతీ వర్షపు బొట్టు కృష్ణా నదికే పోతుంది. కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది.