రంగారెడ్డి, జూలై 22(నమస్తే తెలంగాణ) : వచ్చేవి అరకొర వేతనాలు.. అదీ నెలల తరబడిగా రాకపోవడంతో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయగా ఔట్ సోర్సింగ్‌పై జిల్లాలో సుమారుగా 64 మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, స్కూల్ సబార్డినేటర్లుగా పనిచేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులకు నెలకు రూ.22,750, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.19,500, స్కూల్ సబార్డినేటర్కు రూ.16 వేల చొప్పున నెలనెలా వేతనాలను చెల్లిస్తున్నారు.
నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలకు కనీసం స్కూల్ ఫీజు చెల్లించలేక.. యూనిఫామ్, నోట్ బుక్స్ కొనలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు వచ్చేందుకు బస్సు చార్జీల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే వేతనాలు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లకు తమ ఇబ్బందులు చెప్పుకొని.. వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను అందజేశారు.
నెలల తరబడిగా వేతనాలు రాకపోవడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా ఉన్నది. పిల్లలను కూడా చదివించుకోలేని దుస్థితిలో ఉన్నాం. వేతనాలు విడుదల చేయాలన్న మా మొరను ఆలకించేవారే కరువయ్యారు. ఇప్పటికైనా మా పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలి.
-నవనీత, మోడల్ స్కూల్ కంప్యూటర్ ఆపరేటర్
వేతనాల విషయమై అడిగితే ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇంకా టైం పడుతుంది. ఎప్పుడు వస్తాయో! చెప్పలేమంటున్నారు. వేతనాలు రాకపోవడానికి గల కారణం ఏమిటో తెలియడం లేదు. ఇప్పటికైనా ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వేతనాలు విడుదల చేయాలి.
-ఆంజనేయులు, మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు