రామగిరి, ఫిబ్రవరి 21: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని ఓ పెండ్లి వేడుకలో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపేటకు చెందిన సత్తయ్య, రామగిరి మండలం బేగంపేటలోని కొమురయ్య అన్నదమ్ములు. శనివారం ఇద్దరూ కలిసి సెంటినరీకాలనీలో ఓ పెండ్లి వేడుకకు హాజరయ్యారు. బేగంపేటకు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బుర్ర రాజకొమురయ్య పాతకక్షలను మనసులో పెట్టుకొని సత్తయ్యపై కత్తితో దాడిచేయగా, అతడి చేతికి గాయమైంది. అక్కడే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు వెళ్లగా, రాజకొమురయ్య అతని ఛాతిలో పొడిచాడు.
తీవ్రగాయాలైన కొమురయ్యను స్థానికులు సింగరేణి దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బుర్ర రాజకొమురయ్య పథకం ప్రకారమే సత్తయ్యపై దాడి చేశాడని, అడ్డుకునేందుకు వెళ్లిన తన భర్తను హత్యచేశాడని కొమురయ్య భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొమురయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.