ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి 21 : సాగు నీటి కోసం కిలోమీటరున్నర పొడవైన కాలువ నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు ఏం సేవ చేస్తాడని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె రైతులు ప్రశ్నించారు. తాము ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నా కనికరించడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీ పరిధిలోని ఆర్డీ3 ఎల్ఎం 6 కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ 200 మంది రైతులు శనివారం పాదయాత్ర చేపట్టారు.
కాలువ నిర్మాణం కోసం కొన్ని రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ శివారులో రైతులు చేపట్టిన రిలే దీక్షకు సంఘీభావంగా రామన్నపల్లెకు చెందిన రైతులు ఉపాధిహామీ పనులు ముగించుకుని తట్ట, పారలతో నిరసన తెలుపుతూ పెద్దలింగాపూర్కు పాదయాత్రగా చేరుకున్నారు. అక్కడే వంట చేసి, రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యం లేక తమ బతుకులు రోడ్డు మీదకు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనికరించడం లేదని విమర్శించారు.
తాము ఎండలో ఉద్యమిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. నిలిచిపోయిన కిలోమీటరున్నర కాలువను తవ్వించి, రైతులకు రూ.3.20 కోట్ల పరిహారం ఇప్పించలేని ఎమ్మెల్యే ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలువ నిర్మాణం చేపట్టే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో రామన్నపల్లి సర్పంచ్ ఆత్మకూరు అనిల్, పెద్దలింగాపూర్ ఉపసర్పంచ్ ఏలవేని రమేశ్, రామన్నపల్లి ఉపసర్పంచ్ గణపురం శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.