రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం పాఠశాలలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా సర్కారు బడుల్లో హాజరు శాతం పెంచడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నప్పకీ అవసరమైన నిధులు విడుదల చేయడంలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించారు. దీంతో బోధనా ప్రమాణాలు పెరిగాయి. పెద్దసంఖ్యలో ప్రవేశాలు జరిగాయి. కాని, ప్రస్తుతం పాఠశాలలు అనేక సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి.
రంగారెడ్డి, జూన్ 14 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెద్దఎత్తున పెరిగి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి.. సర్కారు బడుల్లో పెద్దఎత్తున చేరారు. జిల్లావ్యాప్తంగా పేద విద్యార్థుల ముంగిటకే కార్పొరేట్ విద్యను గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి వారికి కొండంత అండగా నిలిచింది.
అనేక సంస్కరణలు చేపట్టి విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంతో సర్కారు విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, రెండు జతల స్కూల్ యూనిఫాం, టై, బెల్టులు, షూలతో పాటు పుస్తకాలు.. ఇలా అన్ని రకాల వసతులను పేద విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి ఏడాది పాఠశాల ఆరంభ సమయంలో పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించంతో పాటు అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకోవడం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారు బడుల్లో విద్యనభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించారు.
కాని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడులపై చిన్నచూపు చూస్తున్నది. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యార్థులకు అల్పాహారం లేకుండానే పాఠశాలలను నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీంతోనైనా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయా అంటే.. ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు.
కనిపించని బడిబాట జోష్
ప్రస్తుతం ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో అంత జోష్ కనిపించడంలేదని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మరింత తగ్గే అవకాశముంది.
మౌలిక వసతులు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చడంలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వర్యీం చేస్తున్నది. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున.. అన్ని రకాల వసతులు కల్పించాలి.
– పాతూరి రాజేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు
తూతూమంత్రంగా బడిబాట
ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో తూతూమంత్రంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో జాయిన్ అయిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల కారణంగా ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ఎంతో బలోపేతం చేసినప్పటికీ.. ఆ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నది.
– సాయికుమార్, విద్యార్థి సంఘం నాయకుడు
ప్రభుత్వ పాఠశాలల వివరాలు
ప్రాథమిక పాఠశాలలు : 873
ప్రాథమికోన్నత : 158
ఉన్నత పాఠశాలలు : 279
మొత్తం విద్యార్థులు : 1,57,000