వికారాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్‌ల వద్ద నెలకొన్న సమస్యలతోపాటు విద్యుత్తు ప్రాబ్లమ్స్‌తో నీటి సరఫరా అం తంతా మాత్రంగానే జరుగుతున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పంపింగ్ హౌస్‌ల ద్వారా జిల్లాకు సరఫరా చేస్తుండగా మొదటి పంపింగ్ హౌస్‌లో సమస్యలు తలెత్తితే జిల్లాకు నీటి సరఫరా ఆగిపోతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మిషన్ భగీరథకు సంబంధించి గ్రిడ్ లేదా ఇం ట్రా విలేజ్‌లో నీటి సరఫరా ఆగిపోతే అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఇంట్రా విలేజ్‌లో నీరు రావడంలేదని ప్రజలు ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదని, పంచాయతీ పాలకవర్గం చూసుకుంటుందని దాటవేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఇంట్రా విలేజ్‌కు నీటిని సరఫరా చేసే గ్రిడ్‌లోనూ లీకేజీలు ఏర్పడి మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికా రులు స్పందించడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఐఏఎస్ అధికారి ఈ పథకాన్ని పర్యవేక్షించగా ఎక్కడా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయిన దాఖలాల్లేవ్. కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని పర్యవేక్షించడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో గత నెల రోజులు గా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడం, మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్యను తీర్చాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు.

మిషన్ భగీరథ ద్వారా జిల్లాకు అరకొర నీరే సరఫరా అవుతున్నది. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు 130 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, గత నెలరోజులుగా 60-70 శాతం మాత్రమే అందిస్తున్నారు. గత రెండు రోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో నామమాత్రంగా నీరు అందుతున్నది. రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తుండడంతో ప్రజలకు పానీపాట్లు మొదల య్యాయి.
శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పంపింగ్ చేసి ఎల్లూరు, గౌరదేవిపల్లి, కరకల్పహాడ్, కమ్మదనం పంపింగ్ హౌస్‌ల నుంచి నీటిని అందిస్తున్నా..పై నాలుగు పంపింగ్ హౌస్‌ల్లోని ఏదో ఒక పంపింగ్ హౌస్‌లో సమస్య తలెత్తితే మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఎక్కువగా పంప్ సెట్లలో విద్యు త్తు సమస్య తలెత్తడంతోనే నీటి సరఫరాలో సమస్యలు వస్తున్నట్టు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ నిర్వహణ బాధ్యతను కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో తాగునీటి కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందించి తాగునీటి కష్టాలకు చెక్ పెడితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ పానీపాట్లు షురూ అయ్యాయి. గత నెల రోజులుగా జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత పెరిగి 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 12.87 మీటర్ల లోతుకు జిల్లాలో నీటి నిల్వలు తగ్గగా, మార్చిలో 13.72 మీటర్లకు , ఏప్రిల్ చివరి నాటికి 15 మీటర్లకుగాపై అడుగంటిపోయాయి. ఈ నెలాఖరు వరకు జిల్లాలో భూగర్భజలాలు ఇంకా ప్రమాదకర స్థాయిలో తగ్గే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్లు, బావుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, మరోవైపు మిషన్ భగీరథ నీటి సరఫరా అరకొరగా వస్తుండడంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, పలు గ్రామ పంచాయతీల్లో తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కూడా అంతంతా మాత్రంగానే ఉండడంతో ప్రజలు అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.