గ్రూప్-4 పరీక్షకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా.. 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 18,120 మంది అభ్యర్థుల కోసం 62 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనున్నది. పరీక్షా సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.
రంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. పరీక్షల నిర్వహణ కోసం లైజన్ అధికారులను, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తాగునీటితో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
ప్రతి కేంద్రం వద్ద వైద్య సిబ్బందితో పాటు మెడికల్ కిట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, రైటింగ్ ప్యాడ్స్‌ను అనుమతించకపోవడంతోపాటు పరీక్షా కేంద్రంలోని అన్ని గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఉంచుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయానికి ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్రానికి వచ్చేందుకు అభ్యర్థులు వ్యయ ప్రయాసలు పడకుండా ఆర్టీసీ సైతం సంబంధిత రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.