రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులార్ వరకు 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం సుమారు వెయ్యి ఎకరాల ను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీచేసింది. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వారి భూములను బలవంతంగా పోలీసుల సహకారంతో సేకరించింది. చాలామంది రైతుల నుంచి భూములను తీసుకుని పరిహారం విషయంలో సర్కార్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిలో లేమూర్ గ్రామ సమీపంలో ఉన్న తమ భూములను తీసుకోవద్దంటూ మౌనికతోపా టు మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ట్రిపులా ర్ వరకు ప్రభుత్వం వందలాది ఎకరాలను రైతులకు చెప్పకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండానే పోలీసులను పెట్టి బలవంతంగా సేకరిస్తున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకోసం ప్రభుత్వం ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్న బేగరికంచె వరకు మొదటి విడతలో 447 ఎకరాలను సేకరిస్తున్నదని .. ఇందుకోసం ఇప్పటికే రూ. 60 కోట్ల వరకు పరిహారాన్ని బాధిత రైతులకు చెల్లించినట్లు జడ్జికి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు చెందిన భూములపై యథాస్థితిని కొనసాగించాలని.. వారి సమ్మతితోనే భూములను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ .. ఈ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు.
ఆమనగల్లు : గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం చెల్లించాకే సర్వే చేస్తామని చెప్పి ఇప్పుడు దొడ్డిదారిన సర్వే చేయడమేమిటని సాకిబండతండా గిరిజన భూనిర్వాసితులు మండిపడ్డారు. శుక్రవారం తమకు ఎలాంటి సమాచారం లేకుండా డ్రోన్లతో భూసర్వే చేసేందుకు వచ్చిన బృందాన్ని అడ్డుకున్నారు. సమాచారం లేకుండా మా భూముల్లోకి ఎందుకొచ్చారని వారిని ప్రశ్నించా రు. ఓ సంస్థ తమకు సర్వే చేయమని చెప్పడంతోనే ఇక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు.
ఈ విషయంపై బాధిత రైతులు జిల్లా ఉప కలెక్టర్ భూసేకరణాధికారి రాజు, ఆమనగల్లు తహసీల్దార్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. ఆ సర్వేకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ఏ సర్వే బృందాన్ని అక్కడికి పంపించలేదని తెలిపారు. తమకు ఎకరానికి రూ.1.20 కోట్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్యూచర్సిటీలో ప్లాటు ఇచ్చే దాకా సర్వేకు సహకరించామని నిర్వాసితులు అధికారులకు తేల్చి చెప్పారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకోసం భూములను సేకరిస్తున్న తులేకలాన్, తులేఖుర్దు, తిమ్మాపూర్, గుమ్మడవెల్లి, మాదాపూర్ తదితర గ్రామాల్లో రైతులు భూసేకరణకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా పోలీసుల సహకారంతో భూములను సేకరిస్తున్నది. తమ భూములను తీసుకోవ ద్దని.. భూములకు బదులు భూములివ్వాలని, లేని పక్షంలో మార్కెట్ ధరకు రెండింతల పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మీర్ ఖాన్పేట్ నుంచి ట్రిపులార్ ఏర్పాటు చేస్తున్న ఆకుతోటపల్లి వరకు రెండోవిడత గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం జరుపుతున్న భూసేకరణలోనూ అడ్డు తగులుతున్నారు.