కేశంపేట, మార్చి 25: ప్రభుత్వం రైతుల వ్యవసాయంతోపాటు గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రకటనలు కాగితాలవరకే పరిమితమవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్‌కు కత్తెర పడుతోందని రైతులు, వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, చుట్టూ ముళ్ల పొదలతో ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. సంబంధిత అధికారులు స్పందించి నిరంతర విద్యుత్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అధికారిక లెక్కలు ఇలా..
కేశంపేట మండల కేంద్రంతోపాటు కొండారెడ్డిపల్లి, నిర్దవెల్లి, తొమ్మిదిరేకుల, ఎక్లాస్‌ఖాన్‌పేట, సంగెం, ఇప్పలపల్లి, కొత్తపేట, అల్వాల గ్రామాల్లో 33/11కేవీ 9 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా 2,576 వాటికింద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పని చేస్తున్నాయి. అందులో 6860 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాగా 10112 గృహాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. గృహాలకు సంబంధించి ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో 10కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 166, 15కేవీఏ 208, 25కేవీఏ 154, 16కేవీఏ 28, త్రిఫేస్ కరెంటుకు సంబంధించి 25కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 1170, 63కేవీఏ 50, 100కేవీఏ 170, 160కేవీఏ 1 ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి.
వేధిస్తోన్న లోవోల్టేజీ సమస్య..
మండల వ్యాప్తంగా ఆయా ఫీడర్ల కింద లోవోల్టేజీ సమస్య తలెత్తుతున్నట్లు రైతులు చెబుతున్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో బోరు మోటర్ల వద్ద తరచూ ఫీజువైర్లు ఎగిరిపోతున్నాయని, రాత్రి సమయాల్లో సైతం విద్యుత్ ట్రిప్ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. వేడి ఉక్కపోతల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో లోవోల్టేజీ సమస్య తలెత్తుతుందని, అధికారులు లోవోల్టేజీ సమస్య లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
కంచె లేదు.. పొంచిఉన్న ప్రమాదం..
మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని సంత బజారులో ట్రాన్స్ఫార్మర్ను తీగలు చుట్టుకొని ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రతి బుధవారం జరిగే సంతలో కూరగాయల వ్యాపారులు ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కిందనే కూరగాయలు విక్రయిస్తారని, తీగలు బారిన ట్రాన్స్ఫార్మర్వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు.
ఇక మండల కేంద్రంలోని బ్రిడ్జివద్ద ట్రాన్స్‌ఫార్మర్‌పైకి కంపచెట్లు పాకి రాత్రి సమయాల్లో మంటలు చెలరేగుతున్నాయని సమీప పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండల వ్యాప్తంగా సబ్ స్టేషన్లు, విద్యుత్ వైర్ల మరమ్మతులు అంటూ విద్యుత్‌ను నిలిపివేస్తున్న అధికారులకు మండల కేంద్రంలోని సంత బజారులో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ కనిపించడంలేదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్లను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాత్రి వేళల్లోనూ కరెంట్ కట్..
ప్రభుత్వం 24గంటల నిరంతరం విద్యుత్ అని ప్రచారం చేసుకుంటుంది. కానీ నిరంతరం రావడంలేదు. ఉదయం 1గంటపాటు కట్ చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో కరెంట్ వస్తూ పోతూ ఉంటది. ఇక సాయంత్రంపూట ప్రతిరోజు అరగంటపాటు కట్ అవుతుంది. రాత్రి సమయాల్లో కరెంట్ కట్ అవుతుండడంతో ఉక్కపోతవల్ల నిద్రపట్టడంలేదు. ఉక్కపోత నుంచి ఉపశమనంకోసం బయటకు వెళదామంటే బయట దోమల బెడద అధికంగా ఉంది.
– సాజిద్, సంతాపూర్